PM Modi: గీతా ప్రెస్‌.. కోట్ల మంది విశ్వాసం, దేవాలయం: ప్రధాని మోదీ

వందల ఏళ్ల క్రితం వలసవాదులు దేశంలోని గురుకులాలను ధ్వంసం చేసినప్పుడు.. గీతా ప్రెస్ (Gita Press) మార్గదర్శిగా నిలిచి ఎంతో మందికి చేరువైందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. 

Published : 07 Jul 2023 19:45 IST

గోరఖ్‌పుర్‌: గీతా ప్రెస్‌ ( Gita Press) కేవలం పుస్తకాలు ముద్రించే ముద్రణాలయం మాత్రమే కాదని, కోట్ల మంది విశ్వాసం, దేవాలయమని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని గోరఖ్‌పుర్‌ (Gorakhpur), వారణాశి (Varanasi)లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించారు. గోరఖ్‌పుర్‌ - లఖ్‌నవూ, జోధ్‌పుర్‌- అహ్మదాబాద్‌ల మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని మోదీ ప్రారంభించారు. గోరఖ్‌పుర్‌-లఖ్‌నవూ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అయోధ్య మీదుగా ప్రయాణిస్తుంది. వీటితోపాటు వారణాశిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 

‘‘గీతా ప్రెస్‌ చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతి (Gandhi Peace Prize)ని ప్రకటించింది. గీతా ప్రెస్‌తో గాంధీజీకి ప్రత్యేక అనుబంధం ఉంది. కళ్యాణ పత్రిక ద్వారా గీతా ప్రెస్‌ కోసం ఆయన ఎన్నో రచనలు చేశారు. గీతా ప్రెస్‌ భారత దేశాన్ని ఏకం చేయడంతోపాటు, దేశ ఐకమత్యానికి బలాన్ని చేకూరుస్తుంది. 15 భాషల్లో 1,600 పైగా ప్రచురణలు చేసింది. 1923లో గీతా ప్రెస్‌ ఆధ్యాత్మిక వెలుగులను ప్రారంభించింది. ప్రస్తుతం అది మానవత్వానికి దిక్సూచిగా మారింది. వందల ఏళ్ల క్రితం వలసవాద శక్తులు భారత దేశాన్ని దోపిడీ చేసి, మన గురుకులాలను ధ్వంసం చేశాయి. అలాంటి సమయంలో గీతా ప్రెస్ మార్గదర్శిగా నిలిచి దేశవ్యాప్తంగా ఎంతో మందికి చేరువైంది. అలాంటి సంస్థ శతాబ్ధి ఉత్సవాలన వీక్షించడం మనందరి అదృష్టం. గీతా ప్రెస్‌ కేవలం ప్రెస్ మాత్రమే కాదు. కోట్ల మంది ప్రజల విశ్వాసం, ఎంతో మందికి దేవాలయం’’ అని ప్రధాని మోదీ తెలిపారు. 

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గీతాప్రెస్‌ ప్రచురణ సంస్థకు గాంధీ శాంతి పురస్కారాన్ని అందజేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, అవార్డు కింద ఇచ్చే రూ. కోటి నగదును గీతా ప్రెస్‌ తిరస్కరించింది. ఆ మొత్తాన్ని వేరే చోట ఖర్చు చేయాలని కేంద్రాన్ని కోరింది. మరోవైపు ఈ పురస్కారానికి గీతా ప్రెస్‌ను ఎంపిక చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని