NIA: 26/11 హీరో సదానంద్‌ వసంత్‌ దాటేకు ఎన్‌ఐఏ పగ్గాలు

కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్‌ వసంత్‌ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 28 Mar 2024 00:03 IST

దిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే (Sadanand Vasant Dat) నియమితులయ్యారు. డిసెంబరు 31, 2026 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర కేబినెట్‌ అపాయింట్స్‌ కమిటీ (ACC) ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈయన మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్ అధికారి. ముంబయి 26/11 ఉగ్రదాడి నిందితులు అజ్మల్‌ కసబ్‌, అబు ఇస్మాయిల్‌లను కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. సదానంద్‌ సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి పోలీస్‌ గ్యాలంటరీ మెడల్‌ పొందారు. తర్వాత ఆయన మహారాష్ట్ర ఏటీఎస్‌ అధిపతిగా, సీబీఐలో డీఐజీ హోదాలో, సీఆర్‌పీఎఫ్‌లో ఐజీగా, మహారాష్ట్రలోని మీరా భయందర్‌, వసాయి విరార్‌ ప్రాంతాలకు కమిషనర్‌గా పనిచేశారు.

2008లో సముద్ర మార్గం ద్వారా ముంబయిలోకి ప్రవేశించిన 10మంది ఉగ్రవాదులు రైల్వేస్టేషన్‌, నారిమన్‌ హౌస్‌, తాజ్‌ హోటల్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అనేకమందిని బలితీసుకున్నారు. ఆ సమయంలో ముంబయి అదనపు పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సదానంద్‌.. ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ (CST)లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకొని ఎంతో సాహసోపేతంగా వ్యవహరించారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపి గాయపరిచినా వెనక్కి తగ్గకుండా వారిని కట్టడిచేసి ఎంతోమంది పౌరుల ప్రాణాల్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు.

మరోవైపు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) డీజీగా పీయూష్‌ ఆనంద్‌ను నియమించింది. ఈయన 1991 బ్యాచ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. దీంతోపాటు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్ చీఫ్‌గా 1990 రాజస్థాన్‌ ఐపీఎస్‌ క్యాడర్‌ అధికారి రాజీవ్‌ కుమార్ శర్మను నియమిస్తూ ఏసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని