PM-KUSUM: ‘పీఎం కుసుమ్‌’ పథకం 2026 వరకు పొడిగింపు

ప్రధానమంత్రి కిసాన్‌ ఊర్జా ఏవం ఉత్థాన్‌ మహాభియాన్‌’ (PM-KUSUM) పథకాన్ని 2026వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2022 నాటికే లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ.. కరోనా కారణంగా అమలు సరిగా కాలేదని తెలిపింది.

Published : 02 Feb 2023 23:20 IST

దిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్‌ ఊర్జా ఏవం ఉత్థాన్‌ మహాభియాన్‌’ (PM-KUSUM) పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కొవిడ్‌ కారణంగా ఈ పథకం అమలు ఆశించిన స్థాయిలో జరగలేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఎం కుసుమ్‌ పథకాన్ని మార్చి-2026 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్‌ కారణంగా పథకం అమలుకు ఆటంకం కలిగిన నేపథ్యంలో ఆ లోటును పూడ్చేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపింది.

2022 నాటికి 30,800 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పాదనే లక్ష్యంగా 2019లో ‘పీఎం కుసుమ్‌’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం రూ.34వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. అయితే, కొవిడ్‌ కారణంగా పథకం అమలు, ఆశించిన ఫలితాలు రాలేదని థర్డ్‌పార్టీతో జరిపించిన నివేదిక వెల్లడించినట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖమంత్రి ఆర్‌కే సింగ్‌ వెల్లడించారు. ఆ నివేదిక సిఫార్సు మేరకు ఈ పథకాన్ని 2026 వరకు పొడిగిస్తున్నట్లు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

రైతులతోపాటు దేశంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు ఈ పథకం దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మూడు విభాగాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు రచించింది. 10వేల మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యమే లక్ష్యంగా 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేయడం మొదటిది. వీటిని రైతులు, పంచాయతీలు, సహకార సంస్థలు ఏర్పాటు చేసుకుంటాయి. మరో విభాగంలో 20లక్షల వ్యవసాయ పంపుసెట్లను ఏర్పాటు చేయడం, మూడో విభాగంలో 15లక్షల పంపుసెట్లను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం వంటివి ఉన్నాయి. అయితే, ఈ పథకాన్ని పొడిగించాలని కోరుతూ చాలా రాష్ట్రాలు ఇదివరకు కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్లు సమచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు