Minerals Auction: ₹45 వేల కోట్ల విలువైన ఖనిజ బ్లాకులకు ఈ-వేలం షురూ

అరుదైన ఖనిజ బ్లాకులకు కేంద్రం వేలం ప్రారంభించింది. ఈ- వేలం ఫిబ్రవరి  20వరకు కొనసాగుతుందని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ వెల్లడించారు. 

Published : 29 Nov 2023 22:24 IST

Minerals Auction | దిల్లీ: దేశంలో లిథియం, గ్రాఫైట్‌ వంటి కీలక ఖనిజ బ్లాకులకు కేంద్రం వేలం ప్రారంభించింది. రూ.45,000 కోట్ల విలువైన మొత్తం 20 ముఖ్యమైన ఖనిజాల వేలాన్ని కేంద్ర బొగ్గు, ఖనిజ మంత్రిత్వశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ ప్రారంభించారు. వేలం వేసిన ఖనిజ బ్లాకుల్లో రెండు లిథియం బ్లాకులు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఒక లిథియం బ్లాక్‌ జమ్మూకశ్మీర్‌లో, మరొకటి ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తొలిసారి తాము క్లిష్టమైన ఖనిజాలను గుర్తించామని.. వాటిని బుధవారం వేలానికి కూడా ఉంచినట్లు తెలిపారు. ఈ 20 బ్లాకులు ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్‌, బిహార్‌ సహా పలు రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పారు. 

ఈ ఖనిజ బ్లాకుల విలువ రూ.45వేల కోట్లు ఉంటుందన్న మంత్రి ప్రహ్లాద్ జోషీ.. వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే చెందుతుందన్నారు. ఈ వేలం ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి 20తో ముగుస్తుందని చెప్పారు. బుధవారం ప్రారంభమైన వేలం మొదటి విడత మాత్రమేనని.. మున్ముందు మరిన్ని అరుదైన ఖనిజాల వేలం కొనసాగుతుందన్నారు.  ఇదొక్కటే కాకుండా పరిశ్రమల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా క్లీన్‌ ఎనర్జీ టెక్నాలజీని పెంపొందించేందుకు సంబంధిత చట్టాలను సవరిస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్‌లో 5.9 మిలియన్‌ టన్నుల నిల్వలతో తొలి లిథియం నిక్షేపాలను గుర్తించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు