Pune: టీనేజర్‌ డ్రైవింగ్‌ ఘటనలో డ్రైవర్‌ను ఇరికించేందుకు కుట్ర.. నిందితుడి తాత అరెస్టు

టీనేజర్‌ డ్రైవింగ్‌తో ఇద్దరు టెకీలు మృతిచెందిన ఘటనలో నిందితుడైన బాలుడి తాతను పోలీసులు అరెస్టు చేశారు. యాక్సిడెంట్‌ కేసులో వారి డ్రైవర్‌పై నేరాన్ని మోపడానికి ఆయన యత్నించినట్లుగా పేర్కొన్నారు.

Published : 25 May 2024 12:45 IST

పుణె: పుణె (Pune)లో ఇటీవల ఓ టీనేజర్‌ మద్యం మత్తులో లగ్జరీ కారుతో బైక్‌ను ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి తాతను శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో నేరాన్ని తమ ఫ్యామిలీ డ్రైవర్‌పై మోపేందుకు నిందితుడి కుటుంబం ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో బాలుడిని జైలు శిక్షనుంచి కాపాడడం కోసం అతడి కుటుంబ సభ్యులు యత్నించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారును తమ డ్రైవర్ నడిపాడని బాలుడి తండ్రి పేర్కొన్నాడు. దాన్ని డ్రైవర్‌ ఖండించారు. ఆ సమయంలో అక్కడ లేనని బాలుడే స్వయంగా కారును నడిపాడని వెల్లడించాడు. తానే యాక్సిడెంట్‌ చేశానని పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిందితుడి తాత బెదిరిస్తున్నారని, నిర్బంధించారని ఆ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాలుడి తాతను అరెస్టు చేశారు.

ఈ కేసులో నిందితుడైన బాలుడి తండ్రి స్థానికంగా ఓ ప్రముఖ ప్రైవేటు బిల్డర్‌ కావడంతో పోలీసులు బాలుడిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని, తమ పిల్లలను చంపిన బాలుడిని మేజర్‌గా పరిగణించి తగిన శిక్ష విధించాలని మృతుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

గత ఆదివారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం బాలుడిని కోర్టులో హాజరు పరచగా జువైనల్‌ కోర్టు కొన్ని షరతులతో (Bail Conditions) బెయిల్‌ మంజూరు చేసింది. ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది. కోర్టు తీర్పుపై విమర్శలు వ్యక్తమవడంతో జువెనైల్ జస్టిస్ బోర్డ్ తీర్పును సవరించింది. బాలుడిని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపింది. నిందితుడి తండ్రి, రెండు బార్‌ల సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని