Salman Khan: నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు

Salman Khan: ముంబయిలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి.

Updated : 14 Apr 2024 09:00 IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబయిలో సల్మాన్‌ నివాసముండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ ముందు ఈ ఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు పోలీసులు వెల్లడించారు. క్రైం బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్‌ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు.

గత ఏడాది మార్చిలో సల్మాన్‌ను (Salman Khan) బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈమెయిల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ముంబయి పోలీసులు.. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డీ బ్రార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వీరు టార్గెట్‌ చేసిన జాబితాలో సల్మాన్‌ పేరున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు. ఇదే విషయంపై ఆయనకు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. 2023 ఏప్రిల్‌లోనూ ఇదే తరహా బెదిరింపుల రావటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ‘ఎక్స్‌’ గ్రేడ్‌ భద్రతను ‘Y+’గా అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్‌కు నిత్యం భద్రతగా ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని