Harsh Goenka: భాజపా హ్యాపీ..కాంగ్రెస్ హ్యాపీ: ఆకట్టుకుంటోన్న హర్ష గోయెంకా ఫన్నీ పోస్టు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) పెట్టిన పోస్టు ఆకట్టుకుంటోంది. 

Published : 05 Jun 2024 15:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే విషయాలతో పాటు వర్తమాన అంశాలను ప్రస్తావిస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka). వాటికి తనదైన చమత్కారాన్ని జోడిస్తుంటారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల (Lok Sabha Election Results)పై ఆయన చేసిన పోస్టు వైరల్‌గా మారింది.

ప్రస్తుత ఫలితాల్లో ఎన్డీయే కూటమి మెజార్టీ మార్కు దాటింది. అలాగే విపక్ష ‘ఇండియా’ కూటమి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను భిన్నంగా మెరిపించింది. దీనిని ఉద్దేశించి.. ‘‘ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది కాబట్టి భాజపా హ్యాపీ. వందసీట్లు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ హ్యాపీ. ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్యంగా పుంజుకుంది కాబట్టి సమాజ్‌వాదీ పార్టీ సంతోషంగా ఉంది. ఎన్‌సీపీ(ఎస్పీ), శివసేన(యూబీటీ) వాటి చీలిక పక్షాల కంటే మెరుగైన ప్రదర్శన చూపాయి గనుక అవీ హ్యాపీనే. బెంగాల్‌లో దూకుడు చూపించి తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆనందంగా ఉంది. ఈవీఎంలపై ఎలాంటి విమర్శలు రాకపోవడంతో అందుకు ఎన్నికల సంఘం హ్యాపీ. ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ అంటే ఇదే కదా’’ అని చమత్కరించారు. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందించారు. ఎన్నికల ఫలితాలపై కామెంట్‌ సెక్షన్‌లో వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

ఎన్నికల ఫలితాల్లో (Lok Sabha Election Results) భాజపా ఒంటరిగా 240 సీట్లు సాధించగా.. దాని నేతృత్వంలోని కూటమికి 293 స్థానాలు దక్కాయి. ఇండియా కూటమి అభ్యర్థులు 233 చోట్ల విజయం సాధించారు. ఆ కూటమి ప్రధాన పార్టీ కాంగ్రెస్‌కు 99 సీట్లు వచ్చాయి. ఈక్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే సన్నద్ధమవుతోంది. జూన్‌ 8న కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని