Harsh Goenka: ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్‌ ఫార్ములా షేర్‌ చేసిన హర్ష గోయెంకా

ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్‌ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్‌లో షేర్‌ చేశారు.

Updated : 30 Mar 2024 14:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మారుతున్న కాలానికనుగుణంగా మనిషి జీవనశైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. పాత తరం వాళ్లు 90ఏళ్లు దాటినా ఆరోగ్యంగా జీవిస్తుంటే.. నేటి తరం మాత్రం 30ఏళ్లకే వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యవంతమైన జీవనం కోసం ఏం చేయాలో ఓ డాక్టర్‌ చెబుతున్న వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు. దీనికి ‘సింపుల్‌ సీక్రెట్‌ టు లాంగ్‌ లైఫ్‌’ అని కామెంట్ జోడించారు. 

ఈ వీడియోలో డాక్టర్‌ నిషిత్‌ చోక్సీ మాట్లాడుతూ.. ‘‘నా దగ్గరకు వచ్చే చాలా మంది రోగుల్లో 90 నుంచి 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. నన్ను కలవడానికి వచ్చిన ప్రతిసారీ మా మధ్య మందుల గురించి చర్చ రాదు. వాళ్లను నేను రెండు విషయాలు అడుగుతా. మీ రక్తపోటు ఎలా ఉంది? దానికి వాళ్లు బాగానే ఉందని సమాధానమిస్తారు. ఛాతీలో ఏమైనా నొప్పి ఉందా? అని అడిగితే.. ఏం లేదు, అంతా బాగానే ఉందంటారు. తర్వాత వాళ్ల మనవళ్లు, మనవరాళ్ల గురించి కాసేపు ముచ్చటిస్తాం. మీరు 90 ఏళ్ల వయసులో కూడా చురుగ్గా ఉంటూ.. మీ పనులు స్వయంగా చేసుకోవడం వెనుక రహస్యం ఏంటి? అని అడిగితే.. దానికి వాళ్లు చెప్పే సమాధానం.. సంతోషంగా ఉండటం, నీకున్న దానితో తృప్తి చెందడం, వ్యాయామం చేయడం. ఈ మూడు విషయాలే తమ ఆరోగ్యకర జీవన రహస్యం అంటారు. నేను మాట్లాడే వాళ్లలో ఒకరితో ఒకరికి పరిచయం లేదు. కానీ, వాళ్లంతా చెప్పే సమాధానం ఒక్కటే. వీళ్లలో 90 ఏళ్ల మహిళ ఉన్నారు.  ఆమె రోజూ జిమ్‌కు వెళ్తారు. చేతికర్ర సాయం లేకుండా నడుస్తారు. ఆమె మెదడు ఎంతో చురుగ్గా ఉంటుంది. వంట తనే చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువే. కొన్నిసార్లు మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం. కావాల్సింది దొరకలేదని ఆందోళన చెందుతాం. ఇవి శరీరంపై ఒత్తిడిని పెంచి రక్తపోటు వంటి వాటికి కారణమవుతాయి. జరిగేది ఎలాగూ జరగక మానదు. సంతోషం, సంతృప్తి, వ్యాయామం ఈ మూడు జీవితంలో ఎంతో ముఖ్యమైనవి’’ అని వివరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు డాక్టర్‌ ఫార్ములాతో ఏకీభవిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని