Haryana bus crash: ఆ చిన్నారుల ప్రాణాలు దక్కేవే.. ప్రమాదాన్ని ముందే పసిగట్టి బస్సు ‘కీ’ లాక్కున్న స్థానికులు

Haryana School bus crash: హరియాణాలో స్కూల్‌ బస్సు ప్రమాదం ఆరుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడంతో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Updated : 12 Apr 2024 10:37 IST

చండీగఢ్‌: హరియాణాలో గురువారం జరిగిన స్కూల్‌ బస్సు ప్రమాదం (Haryana School bus crash) దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. సెలవు రోజు పాఠశాల తెరవడంతో పాటు స్కూల్‌ బస్సుల భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగురు చిన్నారుల మృతికి కారణమైన ఈ ప్రమాదంలో తాజాగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

స్థానికులు ముందే ఆపారు..

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్‌ ధర్మేంద్ర మద్యం మత్తులో ఉన్నారు. అతడి ప్రవర్తన ముందు నుంచీ అనుమానంగానే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. తల్లిదండ్రులు సైతం అతడు నిత్యం మద్యం మత్తులో ఉండడం గమనించి పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త డ్రైవర్‌ను నియమించుకుంటామని వారు హామీ ఇవ్వటంతో వెనక్కి తగ్గారు. అయితే, గురువారం కూడా అతడి తీరు మారకపోగా.. బస్సును ప్రమాదకరంగా నడుపుతున్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే దాన్ని ఆపి తాళంచెవిని తీసుకున్నారు. పాఠశాల యాజమాన్యం రంగంలోకి దిగి ప్రస్తుతానికి బస్సు కదిలేందుకు అనుమతించాలని కోరింది. మర్నాడు నుంచి కొత్త డ్రైవర్‌ను పంపుతామని హామీ ఇచ్చింది. దీంతో గ్రామస్థులు అంగీకరించి తాళంచెవిని అప్పజెప్పారు.

కంటతడి పెట్టించిన దృశ్యాలు..

అక్కడి నుంచి బస్సు కొంత దూరం ప్రయాణించగానే అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఆ సమయంలో అందులో 40 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. రక్తపు మడుగులో పసివాళ్లు పడి ఉండడం.. వారి లంచ్‌ బాక్స్‌లు, బూట్లు, పుస్తకాలు, చెల్లాచెదురవడం చూసిన వారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

నలుగురు సభ్యులతో కమిటీ

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పాఠశాల ప్రిన్సిపల్‌, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రమాదం సంగతి తెలియగానే ఘటనా స్థలానికి వెళ్లిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీమా త్రిఖా.. రంజాన్‌ పర్వదినం సందర్భంగా గురువారం సెలవు ప్రకటించినప్పటికీ పాఠశాలకు ఎందుకు సెలవు ఇవ్వలేదనే విషయమై ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. పాఠశాల బస్సుల భద్రతకు సంబంధించిన విధానాన్ని సమీక్షించేందుకు రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని