Manohar Lal Khattar: శ్రీరామా దీవించు.. బాలుడి పాదాలను తాకిన హరియాణా సీఎం

గణతంత్ర వేడుకల్లో భాగంగా రాముడి వేషం వేసిన ఓ బాల కళాకారుడి పాదాలను హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తాకారు.

Updated : 26 Jan 2024 16:45 IST

చండీగఢ్‌: హరియాణాలో (Haryana) నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాముడి వేషం ధరించిన ఓ బాల కళాకారుడి పాదాలకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (Manohar Lal Khattar) నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కర్నల్‌ నగరంలోని మైదానంలో జెండా వందనం అనంతరం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కొందరు చిన్నారులు రాముడు, సీత, లక్ష్మణుడిగా వేషాలు వేశారు. వేదికపై ఉన్న సీఎం అది గమనించి.. వెంటనే వారి దగ్గరికి వెళ్లి.. రాముడి వేషధారి పాదాలను తాకారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

‘‘ఈ జగత్తులో ప్రతిచోటా ఉండే శ్రీరాముడికి నమస్కారం. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఈ బాల కళాకారుల ప్రదర్శనకు పరవశించి  భావోద్వేగానికి గురయ్యాను. దాన్ని కట్టడి చేసుకోలేక రాముడి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నాను’’ అంటూ ఖట్టర్ రాసుకొచ్చారు. శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అంతకుముందు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. వారు తమ జీవితాలను దేశానికి అంకితం చేసిన మహనీయులని కొనియాడారు.

స్వావలంబన దిశగా భారత్‌: యోగి ఆదిత్యనాథ్‌

భారత్‌ దేశం స్వావలంబన దిశగా అడుగులు వేస్తోందని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. లఖ్‌నవూలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలు అమరవీరులను స్మరించుకోవడానికి మాత్రమే కాదని, ‘ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ అనే భావనను పెంపొందించుకునేందుకు అవకాశం కల్పిస్తాయని యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఈమేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని