General Anil Chauhan: సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త సాంకేతికత అవసరం: సీడీఎస్‌

దేశ భద్రతను పటిష్ఠ పరిచేందుకు సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీడీఎస్‌ జనరల్‌ అనిల్ చౌహాన్‌ తెలిపారు.

Published : 07 Dec 2023 16:33 IST

దిల్లీ: భవిష్యత్‌ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మానవ సహిత, మానవ రహిత సైనిక బలాలను అనుసంధానించడం చాలా కీలకమని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ (General Anil Chauhan) తెలిపారు. ఆ దిశగా భారత్‌ గట్టి ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఆధ్వర్యంలో దిల్లీలో గురువారం నిర్వహించిన ‘ఏవియానిక్స్‌ ఎక్స్‌పో 2023’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు ఎదురైతే వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పటిష్ఠమైన రక్షణ రంగ సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.  

భారత సైనిక బలగాల సన్నద్ధతను పెంచడంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) సంస్థ ముందంజలో ఉందని సీడీఎస్‌  కొనియాడారు. సరికొత్త సాంకేతికతతో వైమానిక రక్షణ పరికరాలను సైన్యానికి అందిస్తోందని చెప్పారు. మానవజాతి మొత్తం మార్పు, పరివర్తనల మధ్యనే నడుస్తోందని చెప్పిన ఆయన.. కేవలం భౌగోళిక రాజకీయ స్వరూపమే కాకుండా భౌగోళిక ఆర్థిక, సాంకేతికత కూడా మనల్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. మిలటరీ బలగాలు పోరాటానికి సంసిద్ధంగా ఉండాలని, అదే సమయంలో భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలు తలెత్తవచ్చన్న దానిపై వారికి అవగాహన ఉండాలన్నారు. దీనికోసం మానవ సహిత, రహిత సైనిక సంపత్తిని అనుసంధానించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని