Gyanvapi: జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో పూజలు.. దిగువ న్యాయస్థానం తీర్పును సమర్థించిన హైకోర్టు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి(Gyanvapi) మసీదు కేసులో వారణాసి జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను అలహాబాద్‌ హైకోర్టు తోసిపుచ్చింది. 

Updated : 26 Feb 2024 11:25 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి(Gyanvapi) మసీదు కేసులో వారణాసి జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సోమవారం అలహాబాద్‌ హైకోర్టు సమర్థించింది. ఈ ప్రార్థనా మందిరం సెల్లార్లో పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించేలా దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. 

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో వారణాసి (Varansi)లో గల కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి ప్రార్థనా మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మసీదు ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులను ఆరాధించడానికి అనుమతివ్వాలంటూ కొంతమంది మహిళలు ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. సీల్‌ చేసిన వాజూఖానా మినహా.. మసీదు ప్రాంగణమంతా కార్బన్‌ డేటింగ్‌, ఇతర పద్ధతులతో భారత పురావస్తు విభాగం(ASI) సర్వే చేసిన సంగతి తెలిసిందే. 

సముద్ర గర్భంలో కృష్ణుడికి మోదీ పూజలు

ఈ సర్వేలో కీలక విషయాలు బయటపడినట్లు హిందువుల తరఫు న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ ఇటీవల తెలిపారు. మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలున్నట్లు నివేదిక పేర్కొందన్నారు. ఈ నేపథ్యంలో ప్రార్థనా మందిరంలో సీల్‌ చేసిన బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు కొద్దివారాల క్రితం వారణాసి కోర్టు అనుమతినిచ్చింది. కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన అర్చకులతో పూజలు చేయించాలని కోర్టు సూచించినట్లు హిందూ మహిళల తరఫు న్యాయవాది విష్ణు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని