Teachers recruitment Scam: బెంగాల్‌లో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు

Teachers recruitment Scam: పశ్చిమ బెంగాల్‌లో 2016లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష చెల్లదని కోల్‌కతా హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పరీక్షతో ఉద్యోగాలు సాధించిన టీచర్లంతా తమ వేతనాలను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది.

Updated : 22 Apr 2024 16:47 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) వ్యవహారంలో కలకత్తా హైకోర్టు (Calcutta High Court) సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ (SLST) నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీని కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది.

ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్‌ సి, గ్రూప్‌ డి స్టాఫ్‌ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్‌ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.

30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి: 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు

ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణ నిమిత్తం కోల్‌కతా హైకోర్టులో ప్రత్యేక డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఈ ధర్మాసనం.. 2016 నాటి టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినందున అది చెల్లదని తీర్పు వెలువరించింది. తక్షణమే ఆ నియామకాలను రద్దు చేసి కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ను సూచించింది. నాటి వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

ఇదే సమయంలో 2016 ఉపాధ్యాయ నియామక ప్రక్రియతో ఉద్యోగాలు పొందిన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నాలుగు వారాల్లోగా తాము అందుకున్న వేతనాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఆ డబ్బు వసూలు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పార్థా ఛటర్జీ ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని