Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్‌.. అరెస్టు నుంచి మినహాయింపుల్లేవన్న కోర్టు

Arvind Kejriwal: మద్యం కేసులో అరెస్టు నుంచి కేజ్రీవాల్‌కు మినహాయింపు ఇవ్వలేమని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Updated : 21 Mar 2024 17:03 IST

దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ (ED) తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. చివరిసారి ఇచ్చిన నోటీసులకు గురువారం (మార్చి 21న) హాజరుకావాల్సి ఉండగా.. ఆయన వెళ్లలేదు. తనకు జారీ అయిన సమన్లను సవాల్‌ చేస్తూ దిల్లీ సీఎం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని అడిగింది. అరెస్టు చేస్తారని భావిస్తుంటే చట్టపరమైన రక్షణ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

ఈడీ ఎదుట ఎందుకు హాజరుకావడం లేదు?: కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు

ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ నేడు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా నిలువరించాలని హైకోర్టును అభ్యర్థించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సీఎంకు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. కేజ్రీవాల్‌ అభ్యర్థనపై ఈడీని వివరణ కోరింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. సమన్లను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో పాటే దీన్ని ఏప్రిల్‌ 22న విచారిస్తామని తెలిపింది.

మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించారు. తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి. ఇక ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అరెస్టయి జైల్లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని