Chennai-Assam Rains: భారీ వర్షాలు.. చెన్నైలో రన్‌వేపైకి వరదనీరు.. అస్సాంకు రెడ్‌ అలర్ట్‌

Rains: భారీ వర్షాలకు పలు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల పరిస్థితులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated : 19 Jun 2023 12:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. తమిళనాడు (Tamil nadu) రాజధాని చెన్నై (Chennai) నగరం, శివారు ప్రాంతాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ వేడి నుంచి ఈ వర్షాలు ప్రజలకు ఉపశమనం కల్పించినప్పటికీ.. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్‌పాస్‌ల్లోకి నీరు చేరి వాహనాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదరుగాలులకు చెట్లు నేలకూలాయి.

చెన్నైలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 102మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో చెన్నై సహా చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువల్లూరు, వేలూరు, రాణిపేట్‌ జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అటు వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపైకి నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం చెన్నైకు వచ్చే 10 విమానాలను బెంగళూరుకు దారిమళ్లించారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

రాజస్థాన్‌లో ఐదుగురు మృతి..

అటు బిపోర్‌జాయ్‌ తుపాను ప్రభావంతో రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బర్మేర్‌, సిరోహి, జలోర్‌లో పలు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. అజ్మేర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రిలోకి వరద నీరు చేరి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అస్సాంలోనూ వరదలు..

అటు ఈశాన్య రాష్ట్రం అస్సాంలోనూ వరదలు ముంచెత్తాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇప్పటికే దాదాపు 34వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలో దాదాపు 142 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. 1500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించాయి. మరో ఈశాన్య రాష్ట్రం సిక్కింలోనూ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి టూరిస్టులు చిక్కుకున్నారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని