‘ఘన’మైన ఆపరేషన్లు.. ‘కువైట్‌ ఎయిర్‌లిఫ్ట్‌’ నుంచి ‘ఆపరేషన్‌ గంగ’ వరకూ..

ప్రపంచంలో ఏ మూల యుద్ధ మేఘాలు కమ్ముకున్నా భీతిల్లేది మనమే... ఎక్కడ బాంబు దాడులు జరిగినా ఉలిక్కిపడేది భారతీయులే...

Published : 02 Mar 2022 01:19 IST

ప్రపంచంలో ఏ మూల యుద్ధ మేఘాలు కమ్ముకున్నా భీతిల్లేది మనమే... ఎక్కడ బాంబు దాడులు జరిగినా ఉలిక్కిపడేది భారతీయులే... ఏ ఉత్పాతం సంభవించినా ఆందోళన మనకే... ఎందుకంటే జగమంత విస్తరించిన కుటుంబం మనది... ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో చిక్కుకున్న గుండెలకు అభయహస్తమిస్తోంది మన సైన్యం... రేపటిపై ఆశ వదులుకున్న వారిని సైతం సురక్షితంగా స్వదేశం తీసుకొస్తున్నాయి మన త్రివిధ దళాలు... దానికోసం భారీ ‘ఆపరేషన్‌’ చేస్తున్నాయి... ఆనాటి కువైట్‌ ఎయిర్‌లిఫ్ట్‌ నుంచి నేటి ఆపరేషన్‌ గంగ వరకు సాగిన సాహసాలివి.

కువైట్‌ ఎయిర్‌లిఫ్ట్‌- ఏడాది: 1990

1990లో కువైట్‌ని ఇరాక్‌ హస్తగతం చేసుకుంది. బాంబు దాడులతో హోరెత్తించింది. అప్పుడు కువైట్‌లో రెండు లక్షల మంది భారతీయులు చిక్కుకుపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడపసాగారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం, భారత సైన్యం, ఎయిర్‌ ఇండియా రంగంలోకి దిగాయి. రెండునెలల కాలంలో రెండు లక్షలమంది భారతీయులను సురక్షితంగా ఇండియా తీసుకొచ్చాయి. ఇప్పటివరకు ఎన్నో యుద్ధాలు జరిగినా ఇంత పెద్ద సంఖ్యలో ఏ దేశమూ తమ పౌరులను వెనక్కి తీసుకురాలేదు. ఇది ప్రపంచరికార్డు. దీనిపై బాలీవుడ్‌లో ‘ఎయిర్‌లిఫ్ట్‌’ పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది.

ఆపరేషన్‌ సేఫ్‌ హోమ్‌కమింగ్‌- సంవత్సరం: 2011

ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాలో 2010లో పౌర తిరుగుబాటు చోటు చేసుకుంది. కొన్ని సాయుధ సంస్థలు కల్నల్‌ గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం మొదలుపెట్టాయి. విచక్షణారహితంగా ఆయుధాలతో దాడి చేస్తూ బీభత్సం సృష్టించాయి. ఆ సమయంలో లిబియాలో పదిహేను వేల మంది భారతీయులు ఉన్నారు. అప్పటి ప్రభుత్వం లిబియా పాలకులు, తీవ్రవాద సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి విమానాలు, నౌకల ద్వారా మొత్తం భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు.

ఆపరేషన్‌ రాహత్‌- ఏడాది: 2015

యెమెన్‌ ప్రభుత్వం, హౌతీ తెగల మధ్య చాలా ఏళ్లుగా రగులుకుంటూ వస్తున్న వివాదం 2015 నాటికి యుద్ధరూపం దాల్చింది. ఇరుపక్షాలు భీకరంగా కాల్పులకు దిగేవాళ్లు. ఆ సమయంలో వేల సంఖ్యలో భారతీయులు చిక్కుకొనిపోయారు. వారిని రక్షించేందుకు అక్కడి ప్రభుత్వ అనుమతితో భారత బలగాలు యెమెన్‌లో అడుగుపెట్టాయి. ఉగ్రవాదులపై మెరుపుదాడి చేస్తూ వేలమంది ఇండియన్స్‌తోపాటు, వందలమంది విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

2016 బ్రసెల్స్‌ తరలింపు- ఏడాది: 2016

బ్రసెల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి నెలలో ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడులకు తెబడ్డారు. ఆ సమయంలో 242 మంది భారతీయులు, జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ప్రభుత్వం, జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ సంయమనంతో వ్యవహరించి రెండు రోజుల్లో వాళ్లందరినీ భారత్‌ తీసుకొచ్చాయి.

వందే భారత్‌ మిషన్‌- సంవత్సరం: 2020

ఈసారి మన ప్రభుత్వం, విమానయాన, నౌకయాన సంస్థలు యుద్ధం చేసింది కరోనా మహమ్మారితో. కొవిడ్‌ వ్యాప్తి అరికట్టేందుకు పలుదేశాలు ఆకాశయాన రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఆ సమయంలో దాదాపు 60 లక్షల మంది భారతీయులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. పరిస్థితి కొంచెం మెరుగు పడగానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. వాయు, జల, రోడ్డు, ఇతర మార్గాల ద్వారా లక్షలమందిని సొంత దేశం రప్పించింది.

ఆపరేషన్‌ దేవ్‌ శక్తి- సంవత్సరం: ఆగస్టు 2021

అఫ్గానిస్థాన్‌ తాలిబన్‌ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న 438 మంది భారతీయులను మన ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో భారత్‌కి సురక్షితంగా తీసుకొచ్చింది.

ఆపరేషన్‌ గంగా- ఏడాది: 2022

తాజాగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మనవాళ్లను స్వదేశం తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ ఇది. అక్కడ దాదాపు ఇరవై వేల మంది భారతీయులున్నారు. అందులో అత్యధికులు వైద్య విద్యార్థులే. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో దశల వారీగా మనవారిని విమానాల్లో తీసుకొస్తున్నారు. ఇప్పటికి సగం మిషన్‌ పూర్తైంది. దీనికోసం కేంద్రమంత్రులు హర్దీప్‌ సింగ్‌ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్‌ రిజుజు, జనరల్‌ వీకే సింగ్‌లు పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని