Mukhtar Ansari: ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్‌.. గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ మృతిపై కుటుంబం అనుమానాలు!

Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు ముఖ్తార్‌ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు.

Updated : 29 Mar 2024 11:28 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ (Mukhtar Ansari) మరణంతో ఆ రాష్ట్రంలో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. ప్రజలు ఎక్కడా గుమికూడదని ప్రకటించారు. బందా, మౌ, గాజీపూర్‌, వారణాసి జిల్లాలో అదనపు బలగాలను మోహరించారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసుల ఐటీ సెల్‌ గట్టి నిఘా వేసింది.

ముఖ్తార్‌ అన్సారీ (Mukhtar Ansari) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సునీల్‌ కౌశల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడు ఉమర్‌ అన్సారీ మాత్రం తన తండ్రికి ‘స్లో పాయిజన్’ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ‘‘రెండురోజుల క్రితం నేను ఆయన్ని కలవడానికి వచ్చాను. నన్ను అనుమతించలేదు. ఆరోగ్యం బాలేకున్నా ఆసుపత్రి నుంచి ఆయన్ని జైలుకు తరలించారు. వైరలైన ఓ వీడియోలో ఆయన పొట్ట ఉబ్బినట్లు ఉండడం కనిపిస్తోంది. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చడానికి తీసుకొచ్చారు. కానీ, 12 గంటల తర్వాత తిరిగి తీసుకెళ్లారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం’’ అని అన్నారు. అంతకుముందు ముఖ్తార్‌ సోదరుడైన గాజీపుర్‌ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ సైతం ఇదే తరహా ఆరోపణలు చేశారు. పోలీసులు వీటిని ఖండించారు.

మరోవైపు అన్సారీ మృతి నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ (Akhilesh yadav) స్పందించారు. జైలులో ఉన్న ఖైదీలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనుమానాస్పదంగా మరణించినప్పుడు సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని నిబంధనలు చెబుతున్నట్లు పేర్కొర్నారు. లేదంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పోతుందని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అయితే, ఆయన ఎక్కడా ముఖ్తార్‌ అన్సారీ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.

ఆరోగ్యం క్షీణించి వాంతులు చేసుకుంటున్న కారణంగా ముఖ్తార్‌ను (Mukhtar Ansari) బాందా జిల్లా జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య గురువారం రాత్రి 8.25కు ఆసుపత్రికి తీసుకువచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ కాసేపటికి మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. రెండు రోజుల కిందట మంగళవారం కూడా రోజంతా ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందించారు. నేడు ఐదుగురు వైద్యుల బృందం శవపరీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని