వితంతువుకు దేవాలయంలోకి అనుమతి నిరాకరణ.. హైకోర్టు ఆగ్రహం.

వితంతువు పేరుతో మహిళను దేవాలయంలోకి అనుమతి నిరాకరించడంపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగరిక సమాజంలో అలాంటి చర్యలకు తావులేదని స్పష్టం చేసింది.

Published : 05 Aug 2023 17:23 IST

చెన్నై: వితంతువు (Widow) పేరుతో మహిళలను దేవాలయాల్లోకి అనుమతించకపోవడం లాంటి ఘటనలకు ప్రస్తుత నాగరిక సమాజంలో చోటు లేదని మద్రాస్ హైకోర్టు (Madras HighCourt) స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి స్త్రీకి తనకంటూ ఓ గుర్తింపు ఉందని పేర్కొంది. ఏళ్ల నాటి సిద్ధాంతాలను ఇంకా పాటిస్తూ మహిళలపై వివక్ష చూపడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించింది. దేవాలయంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న క్రతువులో పాల్గొనేందుకు దేవాలయ కమిటీ అనుమతి తనకు నిరాకరించిందంటూ తంగమణి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆమెను నిలువరించే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. ఆమెకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసుశాఖను ఆదేశిస్తూ.. జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ తీర్పు వెలువరించారు.

తమిళనాడులోని నంబియూర్‌లో ఓ దేవాలయ పూజారిగా పని చేస్తున్న తంగమణి భర్త ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. అయితే, దేవాలయంలో పూజా క్రతువులను నిర్వహించేందుకు ఆమె, తన కుమారుడు ముందుకొచ్చారు. దీనికి దేవాలయ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వితంతువులు క్రతువులు నిర్వహించడం అపచారమని పేర్కొంది. గత కొన్నాళ్లుగా ఈ తంతు నడుస్తూనే ఉంది. తమిళనాడులో ప్రస్తుతం ‘ఆది’ మాసం నడుస్తున్న తరుణంలో ఈ నెల 9, 10 తేదీల్లో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. దీనిపై తంగమణి కమిటీ సభ్యులను కలిసి మాట్లాడారు. పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు తనకు, తన కుమారుడిని అనుమతించాలని కోరారు. దీనిపై  ఆగ్రహం వ్యక్తం చేసిన ఇద్దరు కమిటీ సభ్యులు ఆమెను అసలు గుడి పరిసరాల్లోకే రావొద్దని హుకుం జారీ చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి భద్రత కల్పించాలని కోరారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పులేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. 

దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కమిటీ సభ్యుల చర్యను తీవ్రంగా తప్పుబట్టింది. తంగమణి, ఆమె కుమారుడికి పూజా క్రతువు నిర్వహించేందుకు అనుమతించాలని ఆదేశించింది. కాదని, అడ్డుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేకాకుండా పిటిషనర్‌తోపాటు, ఆమె కుమారుడికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని