జనవరి 1 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు కొనొద్దు: హిమాచల్‌ సీఎం ఆదేశం

జనవరి 1 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు కొనొద్దని రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు హిమాచల్‌ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు ఆదేశాలు జారీ చేశారు.

Published : 01 Jan 2024 02:17 IST

శిమ్లా: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) సీఎం సుఖ్విందర్‌ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) కీలక ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాల కొనుగోళ్లపై ఆంక్షలు విధించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలేవీ జనవరి 1, 2024 నుంచి డీజిల్‌, పెట్రోల్‌ వాహనాలను కొనుగోలు చేయొద్దని ఆదేశించారు.  ఎలక్ట్రానిక్‌ వాహనాలను ప్రోత్సహించడంతో పాటు ‘గ్రీన్‌ అండ్‌ క్లీన్‌ హిమాచల్‌’ లక్ష్యాన్ని  సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   ఒకవేళ ఏవైనా ప్రభుత్వ శాఖలు డీజిల్‌ లేదా పెట్రోల్‌ వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటే రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.  ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

రామాలయానికి విరాళం పేరిట ‘QR Code’ మోసం.. VHP హెచ్చరిక

ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఈ-వాహనాల సంఖ్య 185కు చేరుకోగా.. ప్రైవేటు ఈ-వాహనాల సంఖ్య 2,733గా ఉందని సీఎం అన్నారు. ఎలక్ట్రానిక్‌ వాహనాలను పెంచేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న స్థిరమైన ప్రయత్నాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో మా ప్రభుత్వం ఈ-వాహనాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. రవాణా శాఖ తన అధికారిక వాహనాలను ఈ-వాహనాలతో భర్తీ చేసిన తొలి విభాగంగా నిలిచింది. ఇతర ప్రభుత్వ విభాగాలన్నీ ఇదే విధానాన్ని అనుసరించాలి. అన్ని ప్రభుత్వ శాఖలూ సంప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాల నుంచి దశల వారీగా ఈ-వాహనాలకు మారేలా చూడాలి.  ఈ-వాహనాల వినియోగం కొత్త ఆరంభం మాత్రమే కాదు.. పర్యావరణ పరిరక్షణ పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది’ అని సీఎం సుఖు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని