Assam: 35వేల మంది మెరిట్‌ విద్యార్థులకు స్కూటర్ల పంపిణీ

హైయర్‌ సెకండరీ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కూటర్లను అందజేసే కార్యక్రమాన్ని అస్సాం ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈసారి 35వేల మంది విద్యార్థులకు బైక్‌లను అందించింది.

Published : 01 Dec 2022 01:16 IST

గుహవాటి: చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అస్సాం ప్రభుత్వం భారీ కానుక అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటర్‌ విద్యార్థుల్లో మెరిట్‌ సాధించిన వారికి స్కూటర్లను అందజేసింది. ప్రజ్ఞా భారతీ పథకంలో భాగంగా డాక్టర్‌ బాణికాంత  మెరిట్‌ అవార్డు పేరుతో అస్సాం ప్రభుత్వం వీటిని అందిస్తోంది. దీని ద్వారా ఈసారి మొత్తం 35వేల మెరిట్‌ విద్యార్థులకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్కూటర్లను పంపిణీ చేశారు.

అస్సాం హైయర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ నిర్వహించే పరీక్షలో మెరిట్‌ సాధించిన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేస్తోంది. ఇందుకోసం బాలురు 75శాతం మార్కులు సాధించాలి. అదే బాలికలైతే 60శాతం స్కోర్‌ సాధిస్తే సరిపోతుంది. ఇందులో భాగంగా ఈసారి మొత్తం 35,800 మందిని ఎంపిక చేసింది. వీరిలో 6052 మంది బాలురు ఉండగా, 29,748 మంది బాలికలు ఉన్నారు. అయితే, ఈ పథకంలో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందజేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

అస్సాంలోని కామ్‌రూప్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హాజరై విద్యార్థులకు స్కూటర్లను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక పోస్టు గ్రాడ్యుయేట్‌ చదివే విద్యార్థినిలకు ఏడాదికి రూ.10వేల స్టైపెండ్‌ అందజేసే పథకాన్ని తీసుకురానున్నట్లు సీఎం హిమంత పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని