Indian citizenship: 18 మంది పాక్‌ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

Indian citizenship: 2016, 2018 గెజిట్ నోటిఫికేషన్‌ ప్రకారం దఖలు పడిన అధికారం కింద అహ్మదాబాద్‌ కలెక్టర్‌.. పాక్‌ నుంచి వచ్చిన 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చారు.

Published : 17 Mar 2024 11:37 IST

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో నివాసముంటున్న పాకిస్థాన్‌కు చెందిన 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపునకు హాజరైన గుజరాత్‌ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్‌ సంఘవి వారికి పౌరసత్వం ప్రదానం చేశారు. 2016, 2018 గెజిట్ నోటిఫికేషన్‌ ప్రకారం పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్ మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు అధికారం ఉందని ప్రకటన తెలిపింది. ఇప్పటి వరకు 1,167 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు పేర్కొంది.

నూతన భారత్‌ కల సాకారానికి అందరితో కలిసి పనిచేయాలని తాజాగా పౌరసత్వం పొందిన వారికి మంత్రి పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి పథంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నామన్నారు. భారత పౌరసత్వం పొందిన వారందరినీ ప్రధాన స్రవంతిలో భాగం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. పాక్‌, అఫ్గాన్‌, బంగ్లా నుంచి వచ్చిన బాధిత మైనారిటీలకు సులువుగా, వేగంగా ఇక్కడి పౌరసత్వం ఇచ్చేందుకు ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌ షా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

అమెరికా వారికి పౌరసత్వం ఇస్తుందా..?: హరీష్‌ సాల్వే

పైన తెలిపిన మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వడం కోసం ఉద్దేశించిన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ (CAA-2019)ని కేంద్ర ప్రభుత్వం మార్చి 11న అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని కింద హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రిస్టియన్లకు ఇక్కడి పౌరసత్వం లభించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని