Ravi Kishan: కాశీ తర్వాత కీలకమైనది గోరఖ్‌పూర్‌ స్థానమే.. భాజపా ఎంపీ రవి కిషన్

లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేయడానికి తనకు పార్టీ నాయకత్వం మరోసారి  అవకాశమిచ్చిందని భాజపా ఎంపీ రవి కిషన్‌ ఆనందం వ్యక్తం చేశారు. 

Published : 03 Mar 2024 15:00 IST

గోరఖ్‌పూర్: సినీనటుడు, భాజపా ఎంపీ రవి కిషన్(Ravi Kishan) ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్(Gorakhpur) నుంచి పోటీ చేయడానికి తనకు పార్టీ మరోసారి  అవశామిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘నేను అగ్ర నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. కాశీ తర్వాత అత్యంత కీలకమైన స్థానం గోరఖ్‌పూర్‌ నుంచి నాకు రెండో సారి పోటీ చేయడానికి అవకాశమిచ్చింది. ఈ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. భాజపా 400సీట్లు గెలుస్తుంది. గోరఖ్‌పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది.’’ అని తెలిపారు.

కాగా భాజపా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 అభ్యర్థులతో మొదటి జాబితాను ఆదివారం విడుదల చేసింది. వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ చేయనుండగా, గుజరాత్‌లోని గాంధీ నగర్‌ నుంచి అమిత్‌షా బరిలోకి దిగనున్నారు. ప్రముఖ భోజ్‌పురి నటుడు రవి కిషన్,  యోగి ఆదిత్యనాథ్‌ కంచుకోట  గోరఖ్‌పూర్‌ నుంచి రెండో సారి పోటీ చేయనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన 3లక్షల ఓట్ల ఆధిక్యంతో ఎస్పీ అభ్యర్థి రాంభూల్‌ నిషాద్‌పై గెలుపొందారు. 

భాజపా తొలి జాబితాలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈశాన్య దిల్లీ నుంచి లోక్‌సభ సభ్యుడు మనోజ్‌ తివారీని పోటీలో నిలబెట్టింది. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో దివంగత భాజపా నాయకురాలు సుష్మాస్వరాజ్‌ కుమార్తె బసురి స్వరాజ్‌ను న్యూదిల్లీ అభ్యర్థిగా ప్రకటించారు. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విదిశ నుంచి పోటీ చేయనున్నారు. సర్భానంద సోనోవాల్‌ డిబ్రూగఢ్‌ నుంచి పోటీ చేయనుండగా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కోటా నుంచి బరిలోకి దిగనున్నారు.

రాజస్థాన్‌లోని అల్వార్‌ నుంచి భూపేందర్‌ యాదవ్‌, పోర్‌బందర్‌ నుంచి మన్‌సుఖ్‌ మాండవీయ, రాజ్‌కోట్‌ (గుజరాత్‌) నుంచి పర్‌షోత్తమ్‌ రూపాలా, తిరువనంతపురం నుంచి రాజీవ్‌ చంద్రశేఖర్‌లను పోటీకి దింపింది. 

జోధ్‌పూర్‌లో గజేంద్ర షెకావత్, అమేథీలో స్మృతి ఇరానీ, ఆగ్రాలో ఎస్పీ సింగ్ బఘేల్, ముజఫర్‌నగర్‌లో సంజీవ్ బల్యాన్, ఖేరీలో అజయ్ మిశ్రా తేని, బికనేర్‌లో అర్జున్ రామ్ మేఘ్వాల్, ఫతేహ్‌పూర్‌లో సాధ్వి నిరంజన్ జ్యోతి, సిట్టింగ్ స్థానాల నుంచి కేంద్ర మంత్రులుగా బరిలోకి దిగుతున్నారు. 

ఇండియా కూటమికి మరో ఎదురు దెబ్బ:

జయంత్ చౌదరికి చెందిన రాష్ట్రీయ లోక్ దళ్(RLS) శనివారం ఎన్డీఏ కూటమిలో అధికారికంగా చేరింది. ఆయన దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం ఎక్స్‌ ఖాతాలో ఎన్డీఏలో చేరినట్టుగా ప్రకటించారు. ఆర్ఎల్‌ఎస్‌ పార్టీ ఇండియా కూటమిలో భాగం. చౌదరి భాజపాతో పొత్తు పెట్టుకోవడంతో ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్యతకు మరో ఎదురు దెబ్బ తగిలింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని