Gangster Son Encounter: నాడు యోగి మాటిచ్చారు.. నేడు మట్టిలో కలిపేశారు..!

Atiq Ahmed Son Encounter: ఉత్తరప్రదేశ్‌ (UP)లో గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ కుమారుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఓ హత్య కేసులో 50 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అసద్‌ను ఎట్టకేలకు నేడు అంతమొందించారు.

Updated : 14 Apr 2023 01:20 IST

50 రోజుల వేట.. 42 రౌండ్ల కాల్పులు.. అసద్‌ ఎన్‌కౌంటర్‌ జరిగిందిలా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మిట్టీ మే మిలా దేంగే(మట్టిలో కలిపేస్తా).. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్‌ హత్య ఘటన తర్వాత హంతకులను ఉద్దేశించి సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) అసెంబ్లీ వేదికగా చెప్పిన మాటలివి. అన్నట్లుగా.. ఒక్కో నిందితుడిని ఏరిపారేస్తూ యూపీలో మాఫియాను శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నారు. తాజాగా గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed) కుమారుడు అసద్‌ ఎన్‌కౌంటరే (Encounter) అందుకు ఉదాహరణ. ఉమేశ్‌ పాల్‌ హత్య కేసును అత్యంత సవాల్‌గా తీసుకున్న యూపీ పోలీసులు (UP Police).. ప్రధాన నిందితుడైన అసద్‌ కోసం 50 రోజుల పాటు రాష్ట్రమంతా జల్లెడపట్టారు. చివరకు ఝాన్సీలో అతడిని తుదమొట్టించారు. (Atiq Ahmed Son Encounter)

సీసీటీవీ కెమెరాల్లో చిక్కి..

గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed) మూడో కుమారుడు అసద్‌ అహ్మద్‌. తన ఇద్దరు అన్నలు మరో కేసులో పోలీసులకు లొంగిపోవడంతో అతీక్‌ మాఫియా పనులను ఇతడే చూసుకుంటున్నాడు. మాజీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్య వ్యవహారంలో సాక్షి ఉమేశ్‌పాల్‌పై అతీక్‌ కుటుంబీకులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఉమేశ్‌ను హత్య చేసేందుకు అతీక్‌ జైలు నుంచే పథకం రచించగా.. దాన్ని అసద్‌ అమలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి క్రిమినల్‌ రికార్డులు లేని అసద్‌.. ఉమేశ్‌ పాల్‌ హత్య నాటి వరకు యూపీ పోలీసుల రాడార్‌లో లేడు. ఆ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల్లో అసద్‌ కనిపించడంతో పోలీసులు అతడిపై దృష్టి సారించారు.

ఉమేశ్ హత్య సమయంలో కారులోనే..

ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో ఉమేశ్ (Umesh Pal) తన ఇంటి ఎదుటే దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్యను అసద్‌ దగ్గరుండి పర్యవేక్షించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటన సమయంలో అతడు అక్కడే కారులో ఉండటమే గాక.. ఉమేశ్ ఇంట్లోకి పారిపోతుండగా వెనక నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి అసద్‌ పరారీలో ఉన్నాడు.

రాష్ట్రమంతా గాలించి..

అసద్ కోసం దాదాపు 50 రోజులుగా పోలీసులు (UP Police) విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఒకానొక సమయంలో అతడు నేపాల్‌ పారిపోయినట్లు సమాచారం రావడంతో ఆ దేశానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. మరోవైపు, అసద్‌ మొబైల్‌ ఫోన్లు ఉపయోగించకపోవడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులకు కష్టంగా మారింది. హత్య తర్వాత లఖ్‌నవూ పారిపోయిన అసద్‌.. అక్కడ నుంచి కాన్పూర్‌, మేరఠ్‌, దిల్లీ ఇలా పలు ప్రాంతాల్లో నక్కినట్లు దర్యాప్తులో తెలిసింది. తాజాగా అతడు ఝాన్సీ నుంచి మధ్యప్రదేశ్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందింది. మరోవైపు, ఉమేశ్ పాల్‌ హత్య కేసులో విచారణ నిమిత్తం అసద్‌ తండ్రి అతీక్‌ను నేడు ప్రయాగ్‌ రాజ్‌ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే అతీక్‌ను తరలించే పోలీసు కాన్వాయ్‌పై దాడి చేసి వారిని తప్పించేందుకు అసద్‌ కుట్ర చేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలు అప్రమత్తమయ్యాయి.

ఈ క్రమంలోనే అసద్‌ కోసం ఝాన్సీలో గాలిస్తుండగా.. ఓ బైక్‌పై మరో నిందితుడు గుల్హామ్‌తో కలిసి వెళ్తూ కన్పించాడు. పోలీసులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా నిందితులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి వారిని మట్టుబెట్టారు. ఇద్దరు డీఎస్పీ ర్యాంక్‌ అధికారుల నేతృత్వంలో 12 మంది బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొనింది. ఎన్‌కౌంటర్‌ సమయంలో మొత్తం 42 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

యోగి హయాంలో ప్రతి 13 రోజులకో క్రిమినల్‌ ఖతం..

రాష్ట్రంలో యోగి (Yogi Adityanath) సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా, గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపారు. 2017 మార్చి నుంచి ఇప్పటివరకు యూపీ పోలీసులు 178 మంది క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. అంటే గత ఆరేళ్లలో ప్రతి 13 రోజులకో నేరస్థుడు హతమయ్యాడు. ఇదే కాలంలో 23,069 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. క్రిమినల్స్‌ జరిపిన ఎదురుకాల్పుల్లో 15 మంది పోలీసులు అమరులయ్యారు. 2020 జూన్‌లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని