ఆ దేశాల్లో పాఠశాలలు ఎలా నడుస్తున్నాయ్‌?

కరోనా మహమ్మారి 2020 ఏడాదిని ఒక పీడకలగా మిగిల్చింది. చైనాలో మొదలై ప్రపంచదేశాలకు వ్యాపించి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఈ వైరస్‌ను కట్టడి చేయడం కోసం గతేడాది మార్చి-ఏప్రిల్‌లో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో అన్ని కార్యాకలాపాలతోపాటు

Updated : 31 Jan 2021 15:21 IST

కరోనా మహమ్మారి 2020 ఏడాదిని ఒక పీడకలగానే మిగిల్చింది. చైనాలో మొదలై ప్రపంచదేశాలకు పాకిన ఈ మహమ్మారి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు గతేడాది మార్చి-ఏప్రిల్‌లో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో అన్ని కార్యాకలాపాలు నిలిచిపోవడంతో పాటు పాఠశాలలూ మూతపడ్డాయి. కొన్ని నెలలపాటు విద్యార్థులంతా చదువుకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించినా.. పాఠశాలల్లో బోధనతోనే విద్యార్థులు ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. అందుకే వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చాలా దేశాల్లో పాఠశాలలను తిరిగి ప్రారంభించారు. భారత్‌లోనూ కరోనా నిబంధనలకు లోబడి పలుచోట్ల తరగతులు మొదలయ్యాయి. మరి ఇతర దేశాల్లో కరోనా ప్రభావం పెద్దగా తగ్గకపోయినా.. దాన్ని కట్టడి చేస్తూ పాఠశాలను ఎలా నిర్వహిస్తున్నారు? వైరస్‌ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తెలుసుకుందాం పదండి..

ఎప్పటికప్పుడు శుభ్రం

కరోనా విలయతాండవం చేసిన దేశాల్లో ఫ్రాన్స్‌ ఒకటి. భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైనా.. గతేడాది జూన్‌లోనే పాఠశాలలను తెరుచుకున్నాయి. అయితే, విద్యార్థులు పాఠశాలకు రావడం తప్పనిసరేం కాదని ప్రభుత్వం సూచించింది. ఆ తర్వాత సెప్టెంబర్‌ నుంచి మాత్రం విద్యార్థులు పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని వెల్లడించింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా కరోనా నిబంధనలను కఠినతరం చేసింది. ఆరేళ్లు పైబడిన విద్యార్థులు, టీచర్లు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని షరతు విధించింది. విద్యార్థులు గుంపుగా నిలబడకుండా, పాఠశాల కారిడార్లలో ఎదురెదురుగా నడవకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. తరగతి గదుల తలుపులు, భోజనశాలలో బల్లల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించింది. ఫ్రాన్స్‌లో రెండోసారి కరోనా విజృంభించడం, అదే సమయంలో క్రిస్మస్‌ ఉండటంతో విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. జనవరి 4న తిరిగి తరగతులు ప్రారంభించింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

వీలైతే పాఠశాల ఆవరణలో..

ఇటలీలో లాక్‌డౌన్‌ నిబంధనలు చాలా కఠినంగా అమలు చేశారు. మార్చిలో లాక్‌డౌన్‌ విధించగా.. సెప్టెంబర్‌ వరకు పాఠశాలలు మూతపడే ఉన్నాయి. సెప్టెంబర్‌ చివర్లో పాఠశాలలు తెరుచుకోగా.. విద్యార్థుల మధ్య కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు తగ్గట్టు తరగతి గదుల్ని మార్చుకోవాలని చెప్పింది. వీలైతే పాఠశాల ఆవరణలో విద్యార్థులకు బోధించాలని పేర్కొంది. సిలబస్‌ పూర్తి చేయడం కోసం శనివారాల్లోనూ పాఠశాలలు నడిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

ఆరుగురు చొప్పున ఓ గ్రూపు

కెనడాలో దాదాపు 13 జిల్లాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే, విద్యార్థులు, టీచర్లు మాస్కులకు బదులు ఫేస్‌షీల్డ్‌ ధరించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అలాగే యూనెస్కో నిబంధనల ప్రకారం.. చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది. విద్యార్థులను ఆరుగురు చెప్పున ఒక గ్రూపుగా విభజించి.. ఆయా గ్రూపుల మధ్య కనీసం ఒక మీటరు దూరం పాటించాలని, టీచర్లకు 2 మీటర్ల దూరం ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది.   

థర్మల్‌ స్క్రీనింగ్‌.. స్వాబ్‌ పరీక్షలు

కరోనా వైరస్‌ పుట్టినిల్లు అయిన చైనాలో పాఠశాలలో అడుగుపెట్టే ముందు విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. అలాగే లాక్‌డౌన్‌ తర్వాత మొదటిసారి పాఠశాలకు వచ్చిన విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక వుహాన్‌లోని పాఠశాలల్లో అయితే ప్రతి రోజు విద్యార్థుల నుంచి స్వాబ్‌ శాంపిల్స్‌ తీసుకొని పరీక్షలు చేస్తున్నారు.

డెస్క్‌లపై ప్లెక్సీగ్లాజ్‌

నెదర్లాండ్స్‌లోని పాఠశాలల్లో ప్రవేశ ద్వారం వద్ద ప్లాస్టిక్‌ షీల్డ్‌లు, డిసిన్ఫెక్టెంట్‌ జెల్‌ డిస్పెన్సర్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు కూర్చునే డెస్క్‌లపై ప్లెక్సీగ్లాజ్ పెట్టారు. వీటి వల్ల పక్కపక్కన కూర్చునే విద్యార్థులకు ఎలాంటి కాంటాక్ట్‌ ఉండకుండా ఈ ఏర్పాటు చేశారు. మాస్క్‌ ధరించడం అంత తప్పనిసరేమీ కాదని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అయితే, తరగతి గదుల్లో వీలైనంత ఎక్కువ వెంటిలేషన్‌ ఉండేలా చూడాలని సూచించింది.

షిఫ్ట్‌ల వారీగా..

డెన్మార్క్‌లో పాఠశాలల నిర్వహణలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. తరగతుల్ని షిఫ్ట్‌ల వారీగా విభజించారు. ఒక్కో షిఫ్ట్‌లో విద్యార్థులు వేర్వేరు ప్రవేశ ద్వారాల నుంచి రావాలని సూచించారు. అంతేకాదు.. బోధనా సమయాన్ని కూడా తగ్గించారు. కొన్ని పాఠశాలల్లో కరోనాను నియంత్రించడం కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. 

బయో బబుల్‌ గ్రూపులు

స్పెయిన్‌ ప్రభుత్వం మొదట్లో పాఠశాలలు తెరిచినా తరగతులకు హాజరు కావడం.. కాకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇష్టమని తెలిపింది. కానీ, సెప్టెంబర్‌ నుంచి విద్యార్థులు కచ్చితంగా తరగతులకు హాజరుకావాలని స్పష్టం చేసింది. విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడం కోసం 17 ప్రాంతాల్లో 11వేల మంది టీచర్లను అదనంగా నియమించింది. తరగతుల్ని షిఫ్ట్‌ల వారీగా విభజించి.. వీలైతే పాఠశాల ఆవరణల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. 15 నుంచి 20మంది విద్యార్థుల చొప్పున ‘బయో బబుల్‌’ గ్రూపులను ఏర్పాటు చేసి ఆయా గ్రూపుల మధ్య సామాజిక దూరం పాటించేలా చూడాలని పేర్కొంది. 

రేడియోల ద్వారా తరగతులు

ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలు ఇప్పటికే పాఠశాలలు తెరవగా.. కరోనా కేసులు నమోదు కావడంతో మళ్లీ మూతపడ్డాయి. దీంతో విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు వారి తల్లిదండ్రులు మొగ్గుచూపట్లేదు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే తరగతులు కొనసాగేలా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కెన్యా 2020 ఏడాది మొత్తం పాఠశాలలు మూసి వేసింది. ఉగాండా ప్రభుత్వం గ్రామాల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు రేడియోలను ఏర్పాటు చేస్తోంది. కాగా.. కరోనా పరిస్థితులను బట్టి ప్రపంచంలోని అన్ని పాఠశాలల నిర్వహణలో మార్పులు జరుగుతూ ఉన్నాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని