Bengaluru cafe blast case: రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!

రామేశ్వరం కెఫే బ్లాస్ట్‌ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. 

Updated : 18 Apr 2024 17:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఫోన్లు కొనుగోలు చేస్తే.. గుర్తింపు కార్డుల ఆధారంగా పట్టుకోవడం చాలా తేలిక. అదే సెకెండ్‌ హ్యాండ్‌.. థర్డ్‌ హ్యాండ్‌ ఫోన్లు అయితే గుర్తించడం కష్టం.. ఇక వాడేసిన సిమ్‌లు వినియోగిస్తే గుర్తించేదెవరు..? ఇది రామేశ్వరం కెఫే కేసు (Rameshwaram cafe blast case)లో ఉగ్రవాదుల ఐడియా. కానీ, చివరికి వారు సమర్పించిన తప్పుడు ఐడీనే పోలీసులకు బలమైన క్లూను ఇచ్చింది.

తొలుత రామేశ్వరం కెఫే కేసు దర్యాప్తులో బాంబర్‌ వాడిన లిమిటెడ్‌ ఎడిషన్‌ బేస్‌బాల్‌ క్యాప్‌ దర్యాప్తు సంస్థల చేతికి చిక్కింది. వారు దాని ఆధారంగా చెన్నైలోని ఓ లాడ్జిలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కర్ణాటకలో పలుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేసింది. ఈక్రమంలో ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ మేనేజర్‌ అయిన ముజమ్మిల్‌ షరీఫ్‌ను అరెస్టు చేసింది. వాస్తవానికి నిందితులు చెన్నైలోని లాడ్జిలో ఉండేందుకు ఓ గుర్తింపు పత్రంతోపాటు.. షరీఫ్‌కు సంబంధించిన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చారు. ఆ నెంబర్‌గల సిమ్‌ను అప్పటికే షరీఫ్‌ దాదాపు ఐదు నెలల క్రితం వరకు తన ఫోన్‌లో వాడాడు. ఇది దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. ఈ దాడికి లాజిస్టిక్స్‌ సాయం చేసిన షరీఫ్‌ను అధికారులకు పట్టించింది. అతడిని అరెస్టు చేసిన రోజే..ప్రధాన నిందితులైన షాజిబ్‌, తాహ పేర్లను దర్యాప్తు సంస్థ ప్రకటించింది. వీరిద్దరూ విఘ్నేష్‌, సుమిత్‌, మహమ్మద్‌ జునైద్‌ సయీద్‌ పేర్లతో ఫిబ్రవరిలో చెన్నైలోనే మకాం వేసినట్లు మార్చి 29న ఎన్‌ఐఏ గుర్తించింది. 

కొత్త సిమ్‌కార్డులు.. ఫోన్లకు దూరం..

నిందితులు దర్యాప్తు బృందాలను గందరగోళానికి గురిచేయడానికి ముందే ప్లాన్‌ చేసుకొన్నారు. వీరు కొత్తగా ఒక్క ఫోన్‌ లేదా సిమ్‌ను కొనుగోలు చేయలేదు. వీలైనన్ని ఎక్కువ చేతులు మారిన కార్డులు, ఫోన్లు మాత్రమే తీసుకొన్నారు. నిందితులు వాడిన ఒక ఫోన్‌లో ఏకంగా 150 సిమ్‌ కార్డులు వినియోగించారంటే అర్థం చేసుకోవచ్చు. పశ్చిమబెంగాల్‌లో ఫేక్‌ ఐడీలు ఇచ్చి ఇటువంటివి 35 సిమ్‌ కార్డులు కొనుగోలు చేశారు. 

నాలుగేళ్లుగా ఎక్కడ..

షాజిబ్‌, తాహ 2020 నుంచి పూర్తిగా అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు. వీరు ఆ సమయంలో కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో తలదాచుకొన్నారు. ఎక్కడా అత్యధికంగా ఆరు నెలలకు మించి లేరు. చౌకబారు లాడ్జిల్లో ఉంటూ రోడ్డు, రైలు మార్గాల్లోనే ప్రయాణించేవారు. కానీ ఖరీదైన దుస్తులు వాడేవారు. వారిద్దరూ నిరుద్యోగులు కావడంతో డబ్బు ఎక్కడిదనే అంశంపై దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయి. 

తాహాకు క్రిప్టో కరెన్సీ మార్గంలో నిధులు అందితే.. వాటిని మిత్రులు, తెలిసిన వారికి పంపి భారత కరెన్సీలోకి మార్పించేవాడు. వాటినే రోజువారీ ఖర్చులకు వాడుకొనేవారని దర్యాప్తు బృందాలు అంచనా వేశాయి. ఈ క్రమంలో దొంగ ఐడీలు, ఐసిస్‌లో చేరేందుకు వచ్చిన వ్యక్తుల గుర్తింపు కార్డులను తాహా వాడుకొన్నాడు. ఈ రకంగా ముజమ్మిల్‌ షరీఫ్‌కు రూ.లక్ష పంపించి పేలుడుకు అవసరమైన సామగ్రి, సిమ్‌లు, ఫోన్ల కోనుగోళ్లు వంటి ఏర్పాట్లు చేయించాడు. క్రిప్టోల బదిలీపై తాహ చిన్ననాటి మిత్రుడిని కూడా ఇప్పుడు ఎన్‌ఐఏ ప్రశ్నిస్తోంది. శివమొగ్గ ఐఎస్‌ మాడ్యూల్‌ కేసులో జైల్లో ఉన్న మాజ్‌ మునీర్‌కు రామేశ్వర్‌ కెఫే బ్లాస్ట్‌ కుట్రపై ముందే అవగాహన ఉన్నట్లు తెలుసుకొన్నారు. అతడి పేరును కూడా ఈ కేసులో నాలుగో నిందితుడిగా చేర్చారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని