PUBG Love: భర్తతో విభేదించి.. ప్లాట్‌ అమ్మేసి.. ‘పబ్‌జీ’ ప్రేమలో మలుపులెన్నో!

పబ్‌జీలో పరిచయమైన వ్యక్తి కోసం తన నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లోకి ప్రవేశించిన మహిళ.. తాను ఇక్కడే ఉండిపోతానని పేర్కొన్నారు. ఇటీవల పోలీసులు వారిని అరెస్టు చేయగా.. తాజాగా బెయిల్ లభించింది.

Updated : 09 Jul 2023 19:48 IST

దిల్లీ: భారత్‌- పాకిస్థాన్‌ సరిహద్దులు దాటిన ‘పబ్‌జీ’ ప్రేమ కథలో మలుపులెన్నో వెలుగుచూస్తున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్‌ ‘పబ్‌జీ (PUBG)’లో పరిచయమైన వ్యక్తి కోసం.. ఓ పాకిస్థానీ మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లో అక్రమంగా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసులు వారిని అరెస్టు చేయగా.. కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, అప్పటికే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు వెల్లడైంది. తననుతాను భారతీయురాలిగానే భావిస్తున్నానని, ఇక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె పేర్కొనడం గమనార్హం. మరోవైపు.. తన భార్యను తిరిగి పాకిస్థాన్‌కు పంపించాలని ఆమె భర్త విజ్ఞప్తి చేస్తున్నాడు.

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో భారత్‌కు చెందిన సచిన్ మీనా (25), పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌(30)లకు పబ్‌జీలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది మార్చిలో ఆమె కరాచీ నుంచి దుబాయ్‌కి, అక్కడినుంచి నేపాల్‌కు చేరుకుంది. మూడేళ్ల పరిచయంలో అక్కడే తొలిసారి ప్రత్యక్షంగా కలుసుకున్న వారిద్దరు.. పెళ్లి కూడా చేసుకున్నారు. అనంతరం తమతమ ఇళ్లకు చేరుకున్నారు. ఆ రోజు తన ప్రయాణం చాలా కఠినంగా సాగిందని, ఎంతో భయపడ్డానని సీమా గుర్తుచేసుకుంది. అనంతరం.. తన పిల్లలతోసహా భారత్‌లో ప్రవేశించేందుకు ఆమె పెద్ద కసరత్తే చేసినట్లు తెలుస్తోంది.

నేపాల్‌ నుంచి ఇంటికి వెళ్లిన అనంతరం ఆమె తన భర్తతో విభేదించింది. ఓ ప్లాట్‌ను 12 లక్షల పాకిస్థానీ రూపాయలకు విక్రయించి డబ్బు సమకూర్చుకుంది. తనతోపాటు ఏడేళ్లలోపు ఉన్న తన నలుగురు పిల్లలకు విమాన టిక్కెట్లు, నేపాల్ వీసా ఏర్పాటు చేసుకుంది. మేలో దుబాయ్ మీదుగా నేపాల్ చేరుకుని అక్కడి పర్యాటక నగరం పోఖారాలో కొంతకాలం గడిపింది. అక్కడినుంచి ఖాఠ్‌మండూకు చేరుకుని, ఆపై దిల్లీకి బస్సులో బయలుదేరి మే 13న గ్రేటర్ నోయిడాకు చేరుకుంది. అక్కడే సచిన్ ఆమెను అద్దె గృహంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల పోలీసులు వారిని అరెస్టు చేసి జైలులో పెట్టడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సీమా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు అభియోగాలు మోపగా, అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌పై కేసు నమోదైంది. అయితే, ఈ ఇద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక తాను అధికారికంగా భారత్‌లోనే ఉండిపోయేందుకు అధికారులను సంప్రదిస్తానని సీమా తెలిపారు. ‘వాస్తవానికి.. మమ్మల్ని నెలల తరబడి జైల్లో పెడతారని భావించా. కానీ, బెయిల్‌ వార్త వినగానే ఆనందంతో కేకలు వేశా. నా భర్త సచిన్‌ భారతీయుడు.. నేనూ భారతీయురాలిగానే భావిస్తున్నా’ అని ఓ వార్తాసంస్థతో తెలిపింది. పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని, అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని