Nirmala Sitharaman: నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్‌

ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Published : 28 Mar 2024 00:10 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అవకాశం కల్పించారని అన్నారు.

‘ఒక వారం, పది రోజులు ఆలోచించిన తర్వాత కుదరకపోవచ్చు అని చెప్పా. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నా దగ్గర అంత డబ్బు లేదు. ఆంధ్రప్రదేశ్‌ లేదా తమిళనాడు.. ఏదైనా నాకో సమస్య ఉంది. అక్కడ గెలుపునకు కులం, మతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవన్నీ చేయలేనని, అందుకే పోటీ చేయనని చెప్పాను. వారు నా వాదనను అంగీకరించడం గొప్ప విషయం. అందుకే నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు’ అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌ నిర్వహించిన సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీకి చెందిన ఇతర అభ్యర్థుల కోసం ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానన్నారు.

దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి వద్ద ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు లేవా? అని అడిగిన ప్రశ్నకు నిర్మలా సమాధానమిచ్చారు. ‘నా జీతం, నా సంపద, నా పొదుపు మాత్రమే నావి. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం నాది కాదు కదా..’ అని సమాధానమిచ్చారు. ఇదిలాఉంటే, రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న అనేక మంది భాజపా నేతలను లోక్‌సభ ఎన్నికల బరిలో ఆ పార్టీ దింపుతోంది. పీయూష్‌ గోయల్‌, భూపేంద్ర యాదవ్‌, చంద్రశేఖర్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. నిర్మలా సీతారామన్‌ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని