Sonal Goel: ఆ ఎదురుదెబ్బే నాలో కసిని పెంచింది: ఐఏఎస్‌ అధికారిణి

ఐఏఎస్‌ అధికారిణి సోనాల్‌ గోయల్‌ ఎక్స్‌లో చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Published : 23 Feb 2024 16:33 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఐఏఎస్‌ అధికారిణి సోనాల్‌ గోయల్‌ (IAS officer Sonal Goel) ఎక్స్‌లో చేసిన ట్వీట్‌ వైరలైంది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సమయం దగ్గర పడుతుండడంతో పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను ప్రేరేపించేలా తన మొదటి అటెంప్ట్‌లో మెయిన్స్‌లో వచ్చిన మార్క్‌షీట్‌ను ఎక్స్‌లో పోస్టు చేశారు. 2007లో జనరల్ స్టడీస్ పేపర్‌లో తక్కువ మార్కులు రావడంతో ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించలేకపోయానని ఆమె తెలిపారు. 

కాని దానితో కుంగిపోకుండా మరింత కఠిన దీక్ష, నిరంతర అభ్యాసంతో జనరల్‌ స్టడీస్‌పై పట్టు సాధించడానికి నోట్స్‌ తయారుచేసుకోవడం, మెయిన్స్‌లో జవాబులు రాసే విధానంపై  పదే పదే ప్రాక్టీస్‌ చేసేదాన్నని తెలిపారు. దానివల్లే 2008లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, కలెక్టర్‌ కావాలన్న తన కలను నిజం చేసుకోగలిగానని గోయల్ చెప్పుకొచ్చారు.

తాను దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి లా చేస్తూ, ఓ కంపెనీలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ సివిల్స్‌ సాధించానన్నారు. దీనికోసం ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నానని, అందువల్లే  తన ఆప్షనల్‌ సబ్జెక్టులు కామర్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లతో పోల్చితే జనరల్‌ స్టడీస్‌లోనే అత్యధిక మార్కులు సాధించానని గుర్తు చేసుకున్నారు. 

అభ్యర్థులు వైఫల్యాలకు కుంగిపోకుండా వాటినుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఓటమిని విజయానికి దారిలా చూడాలని సూచించారు. ‘‘నాకు తగిలిన ఎదురుదెబ్బే నేను నా లక్ష్యాన్ని సాధించేందుకు కావలసిన కసిని, బలాన్ని, దృఢత్వాన్ని పెంచింది.’’ అని ఆమె ఎక్స్‌లో చేసిన పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ మీరు ఇచ్చిన స్ఫూర్తి గొప్పది. సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులకు, ముఖ్యంగా కామర్స్‌, లాను ఆప్ష్‌నల్‌గా తీసుకున్న వారిలో మీ పోస్టు కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అని ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని