Ashok Gehlot: మోదీజీ.. మీ ట్రిక్స్ నాకు తెలుసు : ప్రధాని ప్రసంగంపై గహ్లోత్‌ వ్యాఖ్యలు

రాజకీయాల్లో తాను సీనియర్ అని ఇదివరకే ప్రధాని మోదీ అన్నారని, అందుకే ఆయన తన సలహా పాటించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్(Ashok Gehlot) అన్నారు. 

Published : 17 Apr 2023 13:40 IST

జైపుర్‌: తాను సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఎవరి మాటల వెనక ఏ మర్మముందో గ్రహించగలనని రాజస్థాన్‌(Rajasthan)ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌(Ashok Gehlot) వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ(PM Modi) పొగడ్తలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల జరిగిన వందే భారత్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్‌గా మాట్లాడారు. దీనిపై గహ్లోత్‌(Ashok Gehlot) స్పందించారు. ‘‘ఆ సందర్భంగా నన్ను ఉద్దేశించి..‘నా స్నేహితుడు గహ్లోత్‌’ అని మోదీ అన్నారు. నా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని వారు అనుకున్నది చేస్తారు. అదొక తెలివి. ఆ మాటల వెనకున్న ట్రిక్స్‌ అర్థమయ్యాయి. నేను కూడా సుదీర్ఘకాలంగా రాజకీయాలు చేస్తున్నాను. నేను రాజకీయాల్లో సీనియర్‌ను అని ఇదివరకు మోదీ అన్నారు. అలా అయితే.. ప్రధాని నా సలహా తీసుకొని, దేశవ్యాప్తంగా పాత పింఛను పథకాన్ని అమలు చేయాలి. ఇది నేను మీకిచ్చే మొదటి సలహా. రాజస్థాన్‌ కోసం మేం తీసుకొచ్చిన ఈ పథకాన్ని మీరు దేశం కోసం అమలు చేయాలి’ అని సూచించారు.

ఆ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘గహ్లోత్‌(Ashok Gehlot)కు ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రంలో రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ సమయం తీసుకొని రైల్వే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలుకుతున్నా’ అని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. గహ్లోత్‌ తమపై ఉంచిన విశ్వాసం తమ స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైల్వేశాఖ మంత్రి, రైల్వే బోర్డు ఛైర్మన్‌లు ఇద్దరూ రాజస్థాన్‌(Rajasthan)కు చెందినవారేనని గుర్తుచేసిన మోదీ.. ‘గహ్లోత్‌ జీ.. మీ చేతులో రెండు లడ్డూలున్నాయ్‌’ అంటూ చమత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని