PM Modi: పెట్టుబడి ఎవరిదైనా.. తయారీలో భారతీయులే: ‘టెస్లా’ ఎంట్రీపై మోదీ కీలక వ్యాఖ్యలు

PM Mod: భారత మార్కెట్లోకి ఎలాన్‌ మస్క్‌ ‘టెస్లా’ ఎంట్రీపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడి ఎవరిదైనా సరే.. తయారీ రంగంలో మాత్రం భారతీయులే ఉండాలని అన్నారు.

Published : 15 Apr 2024 18:05 IST

దిల్లీ: ప్రపంచస్థాయి కంపెనీ భారత్‌లో పెట్టుబడులు పెట్టడం స్వాగతించే విషయమేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. అయితే ఆ కంపెనీల ఉత్పత్తులు భారతీయుల చేతుల్లోనే తయారుకావాలని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జాతీయ మీడియా సంస్థ ఏఎన్‌ఐకి ప్రధాని ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈసందర్భంగా భారత్‌ మార్కెట్లోకి టెస్లా (Tesla) ప్రవేశంపై స్పందించారు.

ఈ ఏడాదిలో భారత పర్యటన, ప్రధాని మోదీ భేటీని ధ్రువీకరిస్తూ ఇటీవల టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీని గురించి ప్రధానిని అడగ్గా.. ‘‘భారత్‌కు పెట్టుబడులు రావాలని నేను కోరుకుంటా. ఇక్కడ ఎవరు పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు. కానీ, తయారీరంగంలో మన దేశ ప్రజల స్వేదం ఉండాల్సిందే. మన మాతృభూమి ప్రత్యేకత ఉండాలి. అప్పుడే మన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’’ అని వ్యాఖ్యానించారు.

ఈసందర్భంగా మోదీ అభిమానిని అంటూ మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ.. ‘‘మోదీ మద్దతుదారును అంటూ మస్క్‌ చెప్పారు. కానీ వాస్తవానికి ఆయన భారత్‌కు మద్దతుదారు. 2015లో నేను టెస్లా ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని మరీ నాతో సమావేశమయ్యారు. తన ఫ్యాక్టరీ మొత్తాన్ని చూపించారు. ఆయన దృక్పథం ఏంటో నాకు అర్థమైంది’’ అని తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలో అనేక రాజకీయ అంశాలు, విపక్షాలపై ఈడీ కేసులు, ఎన్నికల బాండ్లు ఇలా పలు అంశాలపై మోదీ మాట్లాడారు. తాను పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటానని, అయితే అవి ఎవర్నీ భయపెట్టేందుకు కాదన్నారు. దేశ అభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. ఈవీఎంలపై విపక్షాల ఆరోపణల గురించి స్పందిస్తూ.. ‘‘ఓడిపోయిన ప్రతిసారీ వారు (విపక్షాలు) ఓ కారణంతో వస్తారు. ఓటమికి నేరుగా బాధ్యత వహించకుండా మిగతా అంశాలపై నిందలు వేస్తారు’’ అని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని