Brij Bhushan: లోక్‌సభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా: బ్రిజ్‌భూషణ్‌

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండలో నిర్వహించిన భాజపా ర్యాలీలో పాల్గొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను మళ్లీ  పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. 

Published : 11 Jun 2023 23:11 IST

లఖ్‌నవూ: వచ్చే లోక్‌సభలో ఎన్నికల్లో కైసర్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానని భాజపా ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan) వెల్లడించారు. ఈయన మహిళా రెజర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 

మోదీ (Modi) ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని గోండలో నిర్వహించిన ర్యాలీలో బ్రిజ్‌భూషణ్‌ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఈ లోకంలో బతకాలంటే ఒక్కోసారి తీవ్రమైన బాధల్ని, విషాన్ని స్వీకరించాల్సి వస్తుంది. ఇది నా ప్రేమకు లభించిన ప్రతిఫలం. నన్ను నమ్మకద్రోహి అంటున్నారు.. దీన్ని నేను కీర్తిగా భావించాలా? అపఖ్యాతి భావించాలా? వారు నా పేరును పదే పదే పలుకుతున్నారు’’ అనే భావం వచ్చే ఓ ఉర్దు పద్యాన్ని పరోక్షంగా తనపై ఆరోపణలు చేస్తోన్న మహిళా రెజ్లర్లను ఉద్దేశిస్తూ చెప్పారు. మహిళా రెజ్లర్ల అంశంపై నేరుగా స్పందించాలని విలేకరులు కోరగా.. కోర్టు తీర్పునిస్తుందంటూ మాట దాటవేశారు.

భాజపా ర్యాలీలో బ్రిజ్‌భూషణ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు దేశం రెండుగా విడిపోయిందని.. అప్పటి గాయాలు ఇంకా మానలేదన్నారు. అటు పాకిస్థాన్‌, ఇటు చైనా భారత భూభాగాల్ని ఆక్రమిస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ఆ సమయంలో నరేంద్ర మోదీలాంటి ప్రధాన మంత్రి ఉండి ఉంటే.. ఆక్రమణకు గురైన భూమికి విముక్తి లభించేదన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని బ్రిజ్‌భూషణ్‌ వివరించారు.

మరోవైపు బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులను నిరసిస్తూ దేశరాజధానిలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఫిబ్రవరి 28వ తేదీన బ్రిజ్‌ భూషణ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన 200 మంది వాంగ్మూలాలను పోలీసులు సేకరించారు. జూన్‌ 15న బ్రిజ్‌భూషణ్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారు. 

లైంగిక వేధింపులకు గురైన బాధితులను బ్రిజ్‌భూషణ్‌ తన అధికారాల్ని ఉపయోగించి ఇచ్చిన వాంగ్మూలం మార్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు నిరసన తెలుపుతోన్న రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. జూన్‌ 15 వరకు ఆయనపై తగిన చర్యలు తీసుకోకపోతే మళ్లీ ఆందోళనను ప్రారంభిస్తామని హెచ్చరించారు. బ్రిజ్‌భూషణ్‌ ఈ లైంగిక ఆరోపణల్ని ఖండిస్తున్నారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో తాను తెచ్చిన సంస్కరణలు నచ్చని హరియాణకు చెందిన కొందరు కాంగ్రెస్‌ నేతలు నా పరువు తీయడానికి ఇలా కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని