Swati maliwal: ఎంపీ పదవికి రాజీనామా చేయను: స్వాతి మాలీవాల్

ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్‌ ఎంపీ పదవికి రాజీనామా చేయనని తేల్చిచెప్పారు.

Updated : 24 May 2024 13:19 IST

దిల్లీ: ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal) తన పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా అభ్యర్థిస్తే పదవి నుంచి వైదొలగేదాన్నన్నారు. అలా కాకుండా  దాడి చేయడంతో.. ఇప్పుడు పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. 

“2006లో వీరితో కలిసి పనిచేసేందుకు వీలుగా నా ఉద్యోగాన్ని వదులుకున్నాను. అప్పుడు మా సంస్థలో ముగ్గురే ఉండేవారు. వారిలో నేను ఒకరిని. ఆప్‌ను స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమించాను. ఎవరికైనా నా రాజ్యసభ సీటు కావాలంటే నన్ను అడగాలి. పార్టీ కోసం జీవితాన్నే ఇచ్చాను. ఎంపీ సీటు చాలా చిన్న విషయం. నేను ఆప్‌లో చేరినప్పటి నుంచి ఎటువంటి పదవీ కోరలేదు. కానీ, వారు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేను ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయను’’అని మాలీవాల్‌ అన్నారు.

మే 13న దిల్లీ సీఎం నివాసంలో ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై అరవింద్‌ కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం దిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఫోన్‌ను ముంబయిలో ఫార్మాట్‌ చేయించినట్లు గుర్తించిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని