Delhi: దిల్లీలో నిజంగానే అంత ఉష్ణోగ్రత నమోదైందా!.. స్పందించిన ఐఎండీ చీఫ్‌

దిల్లీలోని ముంగేష్‌పుర్‌లో బుధవారం 52.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణగ్రత నమోదైంది. ఇప్పటివరకు భారత్‌లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. దీనిపై ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.మహపాత్ర స్పందించారు. 

Updated : 30 May 2024 09:37 IST

దిల్లీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. సూర్యప్రతాపానికి జనాలు అల్లాడుతున్నారు. బుధవారం దిల్లీ (Delhi)లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్‌పుర్‌లో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. 2002లో 49.2 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటివరకు అత్యధికం. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) స్పందిందించి. దిల్లీలోని ముంగేష్‌పుర్‌ వాతావరణ స్టేషన్‌లోని సెన్సార్‌ సరిగా పనిచేస్తుందో లేదో తనిఖీ చేస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.మహాపాత్ర తెలిపారు.

దిల్లీలో ఉష్ణోగ్రతలు కొలిచేందుకు 20 చోట్ల మానిటరింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అందులో ముంగేష్‌పుర్‌లో అత్యధికంగా 52.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు చూపించదన్నారు. దేశంలో ఇంతవరకు ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఇప్పటివరకు నమోదు కాలేదన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రాల్లో 14 చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గాయని, కొన్నిచోట్ల 45-50 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. మిగతావాటితో పోలిస్తే ముంగేష్‌పుర్‌లో నమోదైన డేటా భిన్నంగా ఉందన్నారు. దీనిని ధ్రువీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఒక బృందాన్ని నియమించామని, వారు ఆ సెన్సార్‌ను పరిశీలిస్తారన్నారు. అయితే, కొన్నిసార్లు స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగానూ అధిక ఉష్ణోగత్రలు నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు.

ఇప్పటివరకు దిల్లీలోని పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు 45.2 నుంచి 49.1 మధ్యే ఉన్నాయి. వీటితో పోల్చినప్పుడు ముంగేష్‌పుర్‌లో నమోదైంది మాత్రం అధిక ఉష్ణోగ్రత అని పేర్కొన్నారు. సెన్సార్‌లో సాంకేతిక లోపం వల్ల కూడా ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు భూ విజ్ఞానశాస్త్ర శాఖ (Ministry of Earth Sciences) మంత్రి కిరణ్‌ రిజిజు దీనిపై స్పందించారు. ఈ రికార్డు ఇంకా అధికారికంగా ప్రకటించలేదని, దిల్లీలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవడం చాలా అరుదన్నారు. ఐఎండీలోని సీనియర్‌ అధికారులను దీనిపై వివరణ అడిగామని, తొందరలోనే వారు దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని