Nagpur Temperature: నాగ్‌పుర్‌లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత

Nagpur Temperature: నాగ్‌పుర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నిజం కాదని వాతావరణ శాఖ వెల్లడించింది. సెన్సర్‌ తప్పిదం వల్లే 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు స్పష్టం చేసింది.

Published : 01 Jun 2024 09:52 IST

నాగ్‌పుర్‌: దేశంలో వేసవి తీవ్రత (Heatwave) విపరీతంగా ఉంది. పలు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో గతంలో లేనంత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ (Nagpur)లో గల ఓ వాతావరణ స్టేషన్‌లో గురువారం ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించింది. దీంతో ప్రజలు హడలిపోయారు. అయితే, అది నిజం కాదని ఆ తర్వాత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఉష్ణోగ్రతను నమోదు చేసే సెన్సర్‌ సరిగా పనిచేయడం లేదని స్పష్టతనిచ్చింది.

నాగ్‌పుర్‌లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్స్‌ (AWS)ను ఏర్పాటుచేసింది. ఇందులో రెండింట గురువారం అసాధారణ ఉష్ణోగ్రతలు (Highest Temperature) చూపించాయి. సోనేగావ్‌లోని ఏడబ్ల్యూఎస్‌ స్టేషన్‌లో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీలు నమోదైంది. మిగతా రెండు స్టేషన్లలో 44 డిగ్రీల ఎండలు ఉన్నట్లు రికార్డయ్యింది. దీంతో ఈ వార్త దేశమంతా వైరల్‌గా మారింది.

అంచనాల కంటే ముందే వర్షాలు!

ఈ క్రమంలోనే వాతావరణ శాఖ (Weather Department) శుక్రవారం సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘మే 30న 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం నిజం కాదు. దీన్ని అధికారికంగా ధ్రువీకరించట్లేదు. నాగ్‌పుర్‌లో ప్రాంతీయ వాతావరణ కేంద్రం నిర్వహిస్తున్న వాతావరణ స్టేషన్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సెన్సర్ సరిగా పనిచేయడం లేదు. దాన్ని బాగు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒక్కోసారి అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్‌ సెన్సర్లు తప్పుడు ఉష్ణోగ్రతలు నమోదు చేసే అవకాశముంది. అప్పుడు సమీపంలోని మరో వాతావారణ స్టేషన్‌లో నమోదైన రికార్డులతో సరిపోల్చుకుంటాం. నాగ్‌పుర్‌లో 56, 54 డిగ్రీలు ఇలా సెన్సర్ల తప్పిదం వల్లే నమోదయ్యాయి. సమీపంలోని మరో స్టేషన్‌లో 44-45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది’’ అని వాతావరణ అధికారులు వెల్లడించారు.

ఇటీవల  దిల్లీ (Delhi News)లోని ముంగేష్‌పుర్‌లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. దిల్లీ చరిత్రలో ఇదే అత్యధికం కావడంతో వాతావరణ శాఖ (IMD) స్పందిందించి. ఆ వాతావరణ స్టేషన్‌లోని సెన్సర్‌ సరిగా పనిచేస్తుందో, లేదో తనిఖీ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు నాగ్‌పుర్‌లోనూ తప్పుడు ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో.. వాతావరణ శాఖ ఏర్పాటు చేసిన ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్ల పనితీరు చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని