
Republic Day:శ్రీనగర్ లాల్చౌక్లో త్రివర్ణ రెపరెపలు.. 30ఏళ్లలో తొలిసారి!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ లాల్‌చౌక్ క్లాక్ టవర్‌పై జాతీయ పతాకం ఆవిష్కృతమైంది. ఈ చారిత్రక క్లాక్ టవర్‌పై గత 30 ఏళ్లలో త్రివర్ణ పతాకం ఎగరడం ఇదే తొలిసారి. సామాజిక కార్యకర్తలు సాజిద్ యూసఫ్ షా, సాహిల్ బషీర్ భట్‌లు క్రేన్ సాయంతో క్లాక్ టవర్‌పై జెండా ఎగరవేశారు.
జనవరి 26న ఈ ఐకానిక్ క్లాక్ టవర్‌పై పాకిస్థాన్ జెండాను ఎగురవేయడం లేదా సెక్షన్ 144 విధించడం ఇక్కడ పరిపాటిగా సాగుతుండేది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా లాల్ చౌక్‌లో మువ్వెన్నెల జెండాను ఎగురవేసేందుకు అనుమతిని లభించలేదు. కానీ ఈసారి మాత్రం ఇద్దరు సామాజిక కార్యకర్తలు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకొని జెండాను ఆవిష్కరించారు.
జెండాను ఎగురవేసిన అనంతరం సాజిద్ యూసుఫ్ షా మాట్లాడుతూ..‘ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వానికే ఈ క్రెడిట్ దక్కుతుంది. లాల్ చౌక్‌లో జెండాను ఎగురవేసే అవకాశం మాకు లభించింది. మొదటిసారిగా మేము భారతదేశంలో ఉన్నామనే భావన కలుగుతోంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. సాహిల్ బషీర్ భట్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ దొంగలు గతంలో ఇక్కడ వారి పతాకాన్ని ఆవిష్కరించేవారు. ఆ చరిత్రను తిరగరాస్తున్నాం అంటూ గర్వంతో వ్యాఖ్యానించారు. వందలాది పోలీసులు, పారామిలటరీ సిబ్బంది భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది.