Uddhav Thackeray: ‘కష్టం ఆయనది.. ఫలితం వారిది’.. ఉద్ధవ్‌పై భాజపా ప్రశంసలు

మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్‌ ఠాక్రే పనితీరుపై భాజపా ప్రశంసలు కురిపించింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

Published : 12 Jun 2024 00:10 IST

ముంబయి: లోక్‌సభ ఎన్నికల్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఎన్డీఏ (NDA) కూటమికి అనుకున్న దానికంటే తక్కువ స్థానాలు వచ్చాయి. ఇండియా కూటమి 29 సీట్లను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే స్పందించిన భాజపా (BJP).. ఎన్నికల ప్రచారంలో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) పనితీరుపై ప్రశంసలు కురిపించింది. ఎంవీయేలోని కాంగ్రెస్‌, ఎన్సీపీ (ఎస్పీ)లపై విమర్శలు గుప్పించింది.

‘‘లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఉద్ధవ్‌ ఠాక్రే మెరుగైన పనితీరు కనబరిచారు. ఆరోగ్యం సహకరించకపోయినా కూటమి కోసం ఎంతో కృషి చేశారు. కానీ, ఎన్నికల్లో మాత్రం ఆయన పార్టీకి బదులు కాంగ్రెస్‌, ఎన్సీపీలకే ఫలితం దక్కింది. గతంలో ఎన్డీఏ కూటమిలో ఆయన ఉన్నప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉద్ధవ్‌ పార్టీ 18 స్థానాల్లో విజయపతాకం ఎగురవేసింది. కానీ, ప్రస్తుతం తొమ్మిది సీట్లకే పరిమితమయ్యింది. ఆయన ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని భాజపా సీనియర్‌ నేత చంద్రకాంత్‌ పాటిల్‌ (Chandrakant Patil ) పేర్కొన్నారు.

మహారాష్ట్రలో 48 స్థానాలు ఉండగా.. ఇండియా కూటమితో కలిసిన ఉద్ధవ్‌ పార్టీ 21 చోట్ల లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే.. తొమ్మిది స్థానాలను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. ఎన్డీఏ కూటమికి దెబ్బ తగిలింది. 2019 నాటితో పోలిస్తే రాష్ట్రంలో ఎన్డీఏ బలం సగానికి సగం తగ్గినట్లు తెలుస్తోంది. భాజపా 9 సీట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే.

‘పరీక్షకున్న గౌరవం దెబ్బతింటుంది’.. నీట్‌ 2024 రద్దు పిటిషన్లపై సుప్రీం

ఈనేపథ్యంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఉద్ధవ్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా భాజపా పావులు కదుపుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్ధవ్‌ ఠాక్రే అందులో చేరే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణా ఇటీవల వ్యాఖ్యానించడం ఊహాగానాలకు ఊతమిచ్చాయి. ఇప్పుడు చంద్రకాంత్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని