NEET UG 2024: నీట్‌ యూజీపై సుప్రీం తీర్పు.. 4.2 లక్షల మంది మార్కుల్లో మార్పు

Eenadu icon
By National News Team Published : 23 Jul 2024 19:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: సుప్రీం కోర్టు (Supreme Court) తాజా తీర్పుతో నీట్‌-యూజీ (NEET UG 2024) పరీక్షకు హాజరైన 24 లక్షల మందిలో సుమారు 4.2 లక్షల మంది అభ్యర్థులు 4 మార్కులు కోల్పోయారు. వారిలో 720కి 720 మార్కులు సాధించిన 44 మంది కూడా ఉన్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. ఫిజిక్స్‌ సెక్షన్‌లోని 29వ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉండటంతో ఆ రెండిట్లో ఏ ఒక్కదాన్ని ఎంపిక చేసినా.. మార్కులు కేటాయించారు. దీనిపై ఓ అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మార్కులు కేటాయించిన తీరును పిటిషనర్‌ కోర్టుకు వివరించారు. ఇలా రెండు సమాధానాలకు మార్కులు ఇవ్వడం వల్ల.. చాలా మందికి 4 మార్కులు అదనంగా వచ్చాయని, మెరిట్‌ లిస్టులో ఇది ఎంతో ప్రభావం చూపిస్తుందని కోర్టుకు వివరించారు.

దీనిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి.. మంగళవారం మధ్యాహ్నం 12లోగా సూచనలను అందించాలని ఐఐటీ దిల్లీని ఆదేశించింది. నిపుణుల సూచన మేరకు.. ఫిజిక్స్‌లోని అటామిక్‌ థీయరీకి సంబంధించిన ప్రశ్నలో రెండు ఆప్షన్లకు మార్కులు ఇవ్వడం కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కేవలం ఆప్షన్‌ 4 ఎంచుకున్న అభ్యర్థులకే మార్కులు ఇవ్వాలంటూ నిర్వాహకులను ఆదేశించింది. దీంతో రివైజ్డ్‌ ర్యాంక్‌లు విడుదల చేయడం అనివార్యమైంది.

మరోవైపు  నీట్‌ యూజీ-2024 పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రశ్నాపత్రం లీకైందన్న మాట వాస్తవమేనని, ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 155 మంది లబ్ధి పొందినట్లు తెలుస్తోందని ప్రధాన న్యాయూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. ఈ ఘటన వల్ల వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధరణకు రావడం ప్రస్తుత దశలో కష్టమన్న ఆయన.. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు