Exit polls 2024: ఎగ్జిట్‌ పోల్స్‌పై చర్చల్లో పాల్గొంటాం..: ‘ఇండియా’ కూటమి ప్రకటన

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ చర్చల్లో పాల్గొనాలని ‘ఇండియా’ కూటమికి చెందిన పార్టీలు నిర్ణయించాయి.

Published : 01 Jun 2024 17:48 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections)పై వెలువడనున్న ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls)పై టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొనాలని ‘ఇండియా’ కూటమి (INDIA Bloc)కి చెందిన పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్‌ మీడియా విభాగం ఛైర్‌పర్సన్‌ పవన్‌ ఖేడా ఈ విషయాన్ని ప్రకటించారు. ఊహాగానాలకు, టీఆర్‌పీ పెంచే ప్రయత్నాలకు తాము ఆస్కారం ఇవ్వదలచుకోలేదని చెబుతూ.. ఈ చర్చల్లో పాల్గొనబోమని ఖేడా శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. శనివారం హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమైన ‘ఇండియా కూటమి’ సీనియర్‌ నేతలు తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఓటరు నాడిపై ఎవరేం చెబుతారో!

జూన్‌ 4న ఓట్ల లెక్కింపు వేళ అనుసరించాల్సిన వ్యూహాలు, కౌంటింగ్ సన్నాహాలు, భవిష్యత్తు కార్యాచరణపైనా ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. ‘‘ఓట్ల లెక్కింపు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ‘ఇండియా’ కూటమి నేతలంతా అనధికారికంగా సమావేశమయ్యాం. పోరు ఇంకా ముగియలేదు. ఫారం 17సీ, ఈవీఎంల విషయంలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శక్తివంచన లేకుండా మేమంతా లోక్‌సభ ఎన్నికల్లో పోరాడాం. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారని భావిస్తున్నాం. సానుకూల ఫలితాలు వస్తాయన్న విశ్వాసంతో ఉన్నాం’’ అని ఖర్గే ట్వీట్‌ చేశారు. ఈ ఎన్నికల్లో తమ కూటమికి 295కుపైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

భేటీకి హాజరైన నేతలు..

మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, శరద్‌ పవార్‌, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, అనిల్‌ దేశాయ్‌, సీతారామ్‌ ఏచూరీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చడ్ఢా, కల్పనా సోరెన్‌, చంపయి సోరెన్‌, టీఆర్‌ బాలు, ఫారుక్‌ అబ్దుల్లా, డి.రాజా, ముకేశ్‌ సహానీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చివరి దశ పోలింగ్‌ నేపథ్యంలో సమావేశానికి హాజరుకాలేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే సమాచారం అందించారు. వ్యక్తిగత కారణాలతో పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ హాజరుకాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని