Bihar Election: ఇంటికో ఉద్యోగం.. ఉచితంగా విద్యుత్తు

Eenadu icon
By National News Desk Published : 29 Oct 2025 06:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దేశంలో అగ్రస్థానానికి బిహార్‌ను చేరుస్తాం  
ఇండియా కూటమి మ్యానిఫెస్టో విడుదల 

పట్నాలో ఇండియా కూటమి మ్యానిఫెస్టోను విడుదల చేస్తున్న దీపాంకర్‌ భట్టాచార్య, తేజస్వీ యాదవ్, పవన్‌ ఖేడా

పట్నా: బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రతి ఇంటినుంచి ఒకరికి ప్రభుత్వోద్యోగంతోపాటు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఇండియా కూటమి ప్రకటించింది. పాత పింఛన్‌ పథకం (ఓపీఎస్‌) పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చింది. సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ మంగళవారం ఈ మేరకు ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో)ను ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖేడా, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో దీనిని విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోకు ‘తేజస్వి ప్రతిజ్ఞ’ అని పేరుపెట్టారు. ఎన్నికల సభల్లోనూ తేజస్వి ప్రసంగించారు. 

ఐటీ పార్కులు.. సెజ్‌లు తీసుకొస్తాం 

‘‘ఆచరణాత్మక పరిష్కారాలతో 25 ప్రధానాంశాలను మా మ్యానిఫెస్టోలో చేర్చాం. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే.. ఉద్యోగాల కల్పనకు కొత్త చట్టాన్ని ప్రవేశపెడతాం. ఉపాధి హామీ పథకాన్ని 20 నెలల్లో అమలుచేస్తాం. తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నవారి సేవల్ని క్రమబద్ధీకరిస్తాం. జీవికా దీదీలకూ దీనిని వర్తింపజేసి, రూ.30,000 జీతం ఇస్తాం. ఐటీ పార్కులు, సెజ్‌లు, వ్యవసాయాధారిత పరిశ్రమలు తీసుకువస్తాం. కల్లుపై నిషేధం ఎత్తివేస్తాం. మద్య నిషేధ చట్టాన్ని సమీక్షిస్తాం. ఎస్సీ-ఎస్టీలపై దురాగతాల నిర్మూలన చట్టం తరహాలో అత్యంత వెనుకబడినవర్గాల కోసం చట్టం చేస్తాం. రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయించే తీర్మానం చేస్తాం. రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా చేయాలనే సంకల్పం మాకుంది’’ అని తేజస్వి చెప్పారు. ఈ మ్యానిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట అని భాజపా, జేడీయూ పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు