Pannun murder plot: ‘పన్నూ హత్యకు కుట్ర’ కేసు దర్యాప్తులో భారత్‌ సహకరించింది: అమెరికా ప్రతినిధి

ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్రకేసు దర్యాప్తులో ఇప్పటి వరకు భారత్‌ పూర్తిగా సహకరించిందని అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని ఆ దేశ రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ వెల్లడించారు.

Published : 01 Apr 2024 12:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసులో భారత్‌ ఇప్పటి వరకు పూర్తిగా సహకరించిందని అమెరికా దౌత్యవేత్త ఎరిక్‌ గార్సెట్టీ కొనియాడారు. ఈ అంశంపై ఇరుదేశాలు సంయుక్తంగా దర్యాప్తుపై పనిచేస్తున్నాయని వివరించారు. ‘‘ఇప్పటి వరకు మేము అడిగిన ప్రతి ఒక్కదాన్ని భారత ప్రభుత్వం పూర్తి చేసిందని అనుకొంటున్నాను. సాధారణంగా ఎటువైపు నుంచైనా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు తీవ్రంగానే పరిగణిస్తాం. ఎవరికైనా ఓ రెడ్‌లైన్‌ ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా, ప్రభుత్వోద్యోగి అయినా మా పౌరుడిపై హత్యాయత్నంలో భాగస్వామి అయితే.. దానిని ఏమాత్రం అంగీకరించం’’ అని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

‘‘భారత్‌ దీనిపై సంయుక్త ఎంక్వైరీ కమిషన్‌ను వేసినందుకు సంతోషించాను. దానిలో సీనియర్‌ అధికారులను నియమించింది. వారు ఈ కుట్రకేసులో దేశీయంగా ఆధారాల సేకరణపై దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ప్రభుత్వ ఏజెంట్లు ఎవరైనా ఉన్నారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అమెరికా కూడా ఇలానే తమ పౌరులు పరాయి దేశాల్లో హత్యలకు కుట్ర చేస్తే దర్యాప్తు చేస్తుంది. ఇలాంటి వాటిల్లో మా ప్రభుత్వ సిబ్బంది ఉన్నా అంగీకరించం’’ అని గార్సెట్టీ స్పష్టం చేశారు.

పన్నూ అంశం అమెరికా-భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ప్రచారాన్ని గార్సెట్టీ కొట్టిపారేశారు. ఖలిస్థానీల ఆగడాల విషయంలో వాషింగ్టన్‌ చూసీచూడనట్లు ఉంటోందన్న విషయాన్ని తోసిపుచ్చారు. భారత్‌లో ఖలిస్థానీ వేర్పాటువాదం చరిత్ర అమెరికాకు తెలుసని వ్యాఖ్యానించారు. క్రిమినల్‌ నెట్‌వర్కుల్లోని వ్యక్తులను అదుపు చేసే విషయంపై కలిసి పనిచేస్తున్నామన్నారు. ‘‘మేము నేరగాళ్ల బహిష్కరణలు, అప్పగింతలపై కలిసి పనిచేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమన్వయం సాగుతోంది. సంపూర్ణ విశ్వాసం లేకపోతే ఇది ఎలా సాధ్యం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని