మోదీ ప్రమాణ స్వీకారానికి ముయిజ్జుకు ఆహ్వానం

నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు ఆహ్వానం అందింది. 

Published : 06 Jun 2024 19:39 IST

దిల్లీ: మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకు ఈ ఆదివారం ముహూర్తం కుదిరిందని సమాచారం. దీనికి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్‌, నేపాల్, మారిషస్ అధినేతలు రానున్నారు. ఈరోజు అందరికీ అధికారిక ఆహ్వానాలు అందుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu)ను కేంద్రం ఆహ్వానించడం గమనార్హం. దౌత్యపరమైన ఒడుదొడుకులు కొనసాగుతోన్న తరుణంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఫలితాల అనంతరం ఎన్డీయే కూటమి విజయంపై ముయిజ్జు అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ‘‘2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన ప్రధానమంత్రి మోదీ, భాజపా, ఎన్డీయే కూటమికి అభినందనలు. భారత్‌, మాల్దీవుల ప్రజల శ్రేయస్సు, ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని సందేశం పంపారు. మరిప్పుడు ఆయన భారత్‌లో పర్యటిస్తారో లేదో తెలియాల్సిఉంది. కాగా,  2014లో మోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సార్క్‌ (SAARC) దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. 2019లో బిమ్స్‌టెక్‌ (BIMSTEC) దేశాల నాయకులు ప్రమాణస్వీకారానికి వచ్చారు.

ఇదిలాఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ (Lakshadweep)ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఈ తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఒడుదొడుకులు చోటుచేసుకున్నాయి. గతేడాది నవంబర్‌లో ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటినుంచి భారత్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. చైనా అనుకూల విధానాలను అవలంబిస్తూ.. ఆ దేశం భారత్‌కు దూరమవుతోంది. ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన గంటల వ్యవధిలోనే దేశం నుంచి భారత మిలటరీ దళాలు వెళ్లిపోవాల్సిందిగా గడువు విధించారు. ఇటీవలే ఈ ప్రక్రియ పూర్తయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని