Raghuram Rajan: భారత్‌.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే!

భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే విద్య, ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి పెట్టాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ (Raghuram Rajan) పేర్కొన్నారు.

Published : 26 Jan 2024 22:52 IST

కోల్‌కతా: 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే విద్య, ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి పెట్టాలని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ (Raghuram Rajan) పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా దేశం సగటున ఆరు శాతం వృద్ధి రేటును కొనసాగిస్తోందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇది ఏ దేశానికీ అంత సులువు కాదన్నారు. కోల్‌కతాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడారు.

‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించాలంటే.. వార్షిక వృద్ధి రేటు ఏడుశాతం సాధించాలి. దీంతో ప్రస్తుతం 2400 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం.. అప్పటికి పదివేల డాలర్లకు పెరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేయాలంటే విద్య, ఆరోగ్యంతోపాటు ప్రభుత్వంలో సంస్కరణలు అవసరం’ అని రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్నత ఆదాయ వర్గాల్లోనే అధిక వినియోగ రేటు ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాలవారు సమానంగా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అధిక విలువ కలిగిన వస్తువుల తయారీ ప్రాముఖ్యాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వీటికి అవసరమైన పరిశోధనలు మరింత పెరగాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా విద్య వికేంద్రీకరణకు రఘురామ్‌ రాజన్‌ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని