‘చెప్పిందే చెప్పే చెత్త రికార్డు మీది’: పాక్‌ను ఎండగట్టిన భారత్‌

పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించి మరోసారి పాకిస్థాన్ మన ప్రతినిధుల చేతిలో చివాట్లు తినింది. 

Updated : 16 Mar 2024 17:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ వేదికగా దాయాది దేశం పాకిస్థాన్‌ తీరును భారత్ ఎండగట్టింది. చెప్పిందే చెప్పే చెత్త రికార్డు ఆ దేశం సొంతమని విసుగు ప్రదర్శించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ(UNGA)లో అయోధ్య రామాలయం, సీఏఏ గురించి ఆ దేశ రాయబారి లేవనెత్తిన నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది.

యూఎన్‌జీఏలో జరిగిన ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్‌ అంబాసిడర్ మునిర్‌ అక్రమ్ మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ, ఇటీవల అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) గురించి ప్రస్తావించారు. దీనిపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ స్పందించారు. ‘‘నా దేశానికి సంబంధించిన విషయాలపై ఈ ప్రతినిధి బృందం సంకుచిత, తప్పుదోవ పట్టించే దృక్ఫథాన్ని కలిగిఉండటం  దురదృష్టకరం. అలాగే ఈ జనరల్‌ అసెంబ్లీ అంతర్జాతీయస్థాయి కలిగిన లోతైన అంశాల గురించి పరిగణిస్తుంటే.. మీ దగ్గర నుంచి భిన్నమైన వైఖరి కనిపిస్తోంది. ఎప్పుడూ చెప్పిందే చెప్పే చెత్త రికార్డు కలిగిన ఆ దేశ ప్రతినిధి బృందం.. ప్రపంచం పురోగమిస్తోన్న తరుణంలో స్తబ్ధుగా ఉండటం విచారకరం’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మీ చేతులు రక్తంతో తడిసిపోయాయి: పాక్‌కు గట్టిగా బుద్ధిచెప్పిన భారత్‌

ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. మరోవైపు రెండురోజుల క్రితం సీఏఏ విధివిధానాలపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు వీలుగా కేంద్రం సీఏఏ-2019ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే..  కొద్దిరోజుల క్రితం కూడా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దాయాదికి మనదేశం గట్టిగా బుద్ధి చెప్పింది. ఉగ్ర దాడులతో పారిన రక్తంతో వారి చేతులు తడిసిపోయాయని న్యూదిల్లీ మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు వారికి లేదని మరోసారి గట్టిగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని