India-Pakistan: మీ చేతులు రక్తంతో తడిసిపోయాయి: పాక్‌కు గట్టిగా బుద్ధిచెప్పిన భారత్‌

India-Pakistan: ఉగ్రవాదులకు అండగా నిలవడంతో పాక్‌ చేతులు రక్తంతో తడిసిపోయాయని భారత్‌ మండిపడింది. మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఆ దేశానికి లేదని దాయాదికి గట్టిగా చెప్పింది.

Updated : 29 Feb 2024 12:42 IST

జెనీవా: అంతర్జాతీయ వేదికపై భారత్‌ (India)ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌ (Pakistan)కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో జమ్మూకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన దాయాదికి భారత్‌ గట్టిగా బుద్ధిచెప్పింది. ఉగ్ర దాడులతో పారిన రక్తంతో వారి చేతులు తడిసిపోయాయని న్యూదిల్లీ మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని మరోసారి గట్టిగా హెచ్చరించింది.

జెనీవా వేదికగా ఐరాస మానవ హక్కుల మండలి 55వ సమావేశం జరుగుతోంది. ఇటీవల ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌, తుర్కియే లేవనెత్తాయి.  మానవ హక్కుల అణచివేత జరుగుతోందని నోరుపారేసుకున్నాయి. ఈ ఆరోపణలకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. ‘రైట్‌ టు రిప్లై’ అవకాశం కింద ఈ మండలికి భారత కార్యదర్శి అనుపమ సింగ్‌ తాజాగా మాట్లాడుతూ.. పాక్‌ తీరును ఎండగట్టారు.

‘‘భారత్‌పై అసత్య ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాక్‌ దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. ఆ దేశం తమ ప్రసంగంలో జమ్మూకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించింది. వారికి మేం చెప్పేది ఒక్కటే..! కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ మా దేశ అంతర్భాగాలే. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఆ దేశానికి ఎలాంటి హక్కు లేదు’’ అని అనుపమ స్పష్టం చేశారు.

‘‘2023 ఆగస్టులో పాకిస్థాన్‌లోని జరన్‌వాలా నగరంలో మైనార్టీలపై దారుణమైన దాడులు జరిగాయి. 19 చర్చీలను తగలబెట్టారు. 89 క్రిస్టియన్‌ నివాసాలను కాల్చివేశారు. అలాంటి వారు మానవహక్కుల గురించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వారు ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారి రక్తంతో పాక్‌ తడిసిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సొంత ప్రజల కష్టాలు తీర్చలేక ఆ ప్రభుత్వం విఫలమైంది. అలాంటి దేశం చేసే అసత్య ఆరోపణలపై మేం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు’’ అని దాయాదిని కడిగిపారేశారు.

ఇక, జమ్మూకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన తుర్కియేపైనా భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘పాక్‌ మాటలకు వంతపాడుతూ తుర్కియే కూడా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం విచారకరం. భవిష్యత్తులో మరోసారి ఇలా జరగకుండా.. అనుచిత వ్యాఖ్యలకు వారు దూరంగా ఉంటారని విశ్వసిస్తున్నాం’’ అని అనుపమ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని