Heart Attack: గుండెపోటు కలవరం వేళ.. 10 లక్షల మందికి సీపీఆర్ ట్రైనింగ్

గుండెపోటుకు గురైన వ్యక్తులకు సీపీఆర్ చేసి, ప్రాణాలు కాపాడేందుకు కేంద్రం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది.  

Published : 06 Dec 2023 12:57 IST

దిల్లీ: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా సంభవిస్తోన్న గుండెపోటు(Heart Attacks) మరణాలు తీవ్ర కలవరం సృష్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లో దసరా పండగ సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ పలువురు మృతి చెందడం ఆందోళన కలిగించింది. ఈ అనూహ్య మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సీపీఆర్‌ టెక్నిక్‌లో శిక్షణ ఇచ్చేందుకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ రోజు(డిసెంబర్ 6) ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది దేశవ్యాప్తంగా అమలుకానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 10 లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్యకేంద్రాల ద్వారా ఈ శిక్షణ అందుతుంది. జిమ్‌లో పనిచేసేవారూ ఈ శిక్షణలో భాగమవుతారు. అధికారిక గణాంకాల ప్రకారం.. 2021 నుంచి 2022 మధ్య ఈ మరణాలు 12.5 శాతం పెరిగాయి. ఈ గుండెపోటు మరణాల గురించి ఇదివరకు మాండవీయ మాట్లాడుతూ.. కొవిడ్‌-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నవారు తర్వాత ఒకటి నుంచి రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. ఈ మేరకు ఆయన భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అధ్యయనాన్ని ఉదహరించారు.

‘గుండె’ జర భద్రం!

ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో గడిచిన ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా 1052 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. వారిలో 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య వయసువారే. ఇలా గుండెపోటు ఘటనలు పెరుగుతోన్న నేపథ్యంలో సీపీఆర్‌(CPR)పై దాదాపు 2లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు