‘గుండె’ జర భద్రం!

కాస్త నడిస్తే కాళ్లు నొప్పి అంటాం. పని చేసీ చేసీ చేతులు పడిపోతున్నాయని వాపోతాం. కాళ్లూ చేతులే కాదు, శరీరంలోని అన్ని భాగాలూ రోజూ ఏదో ఒక సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి ఒక్క గుండె తప్ప.

Updated : 04 Jun 2023 09:33 IST

‘గుండె’ జర భద్రం!

కాస్త నడిస్తే కాళ్లు నొప్పి అంటాం. పని చేసీ చేసీ చేతులు పడిపోతున్నాయని వాపోతాం. కాళ్లూ చేతులే కాదు, శరీరంలోని అన్ని భాగాలూ రోజూ ఏదో ఒక సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి ఒక్క గుండె తప్ప. అమ్మ పొట్టలో ప్రాణం పోసుకున్న నాలుగో వారంలో కొట్టుకోవడం మొదలెట్టి అప్పటినుంచి నిర్విరామంగా పని చేస్తూనే ఉంటుంది గుండె. అది ఒక్క క్షణం లయ తప్పితేనే జీవితం తలకిందులైపోతుంది. ఇక, ఆగితే..? నిలువెత్తు మనిషి నిండుజీవితం పిడికెడంత గుండె ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది. మరి అలాంటిదాన్ని ఎంత పదిలంగా చూసుకోవాలీ..?

ఇంటర్‌ చదువుతున్న కుర్రాడు మైదానంలో ఆడుకుంటూ హఠాత్తుగా కుప్పకూలాడు. హార్ట్‌ ఫెయిల్యూర్‌... అన్నారు డాక్టర్లు.

ఆడుతూ పాడుతూ గడిపే పసివాడికి గుండె ఫెయిలవ్వడమేంటో అర్థం కాలేదు తల్లిదండ్రులకు.

పెళ్లి వేడుకలో భాగంగా నృత్యం చేస్తూ వరుడు ఉన్నట్టుండి విరుచుకుపడి ప్రాణాలు వదిలాడు. కార్డియాక్‌ అరెస్ట్‌... అన్నారు డాక్టర్లు.

ఏ దుర్వార్తో వింటే గుండెపోటు రావచ్చు కానీ సంతోషంగా పెళ్లి చేసుకుంటున్న అబ్బాయికి గుండెపోటు రావడమేంటో తెలియక బాధపడ్డారు బంధువులు.

భార్యా బిడ్డతో అమెరికాలో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ముప్పై మూడేళ్ల యువకుడు ఒకరోజు ఆఫీసు నుంచి వస్తూ కారులోనే ప్రాణం వదిలాడు. అప్పటివరకూ ఎలాంటి అనారోగ్యమూ లేని అతడికి హఠాత్తుగా హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది.

తరచూ వినిపిస్తున్న ఇలాంటి వార్తలు ప్రజల్లో ఎన్నో సందేహాలను రేకెత్తిస్తుంటాయి.

వయసుతో సంబంధం లేకుండా సంభవిస్తున్న మరణాలకు గుండెపోటే ప్రధాన కారణం కావడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి వార్తల్లో చూడడం వల్ల మనం దీన్ని ఇప్పుడు తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నాం కానీ ఇది ఆకస్మిక పరిణామమేమీ కాదంటున్నారు నిపుణులు. గత మార్చిలో రాజ్యసభలో ఒక ప్రశ్నకు జవాబిస్తూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నివేదికను ప్రస్తావించారు. 2016లో దేశంలో సంభవించిన మరణాల్లో మూడోవంతు గుండె జబ్బులవల్లనేనని ఆ నివేదిక చెబుతోంది. గుండెజబ్బు మరణాల సంఖ్య 1990-2016 మధ్య 15 నుంచి 28 శాతానికి పెరిగింద]ట. గత ఎనిమిదేళ్లలో అది ఇంకా పెరిగిందన్నది సుస్పష్టం. గుండె జబ్బుల ప్రమాదం ఇంతగా పెరగడానికి ప్రధాన కారణాలు- పొగాకు, మద్యం, అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లూ, శారీరక వ్యాయామం లోపించడమూ, ఫిట్‌నెస్‌ కోసం అతిగా శ్రమించడమూ లాంటి జీవనశైలి సమస్యలేననీ ఐసీఎంఆర్‌ నివేదిక చెబుతోంది. మరి ఆ అలవాట్లేవీ లేని పదహారేళ్ల పిల్లవాడికి ఎందుకొచ్చిందీ... అంటే ఐసీఎంఆర్‌ నివేదికలో చెప్పినవే కాక మరెన్నో కారణాలూ గుండెజబ్బుకు దారితీస్తున్నాయి. అందుకే, గుండెకు పొంచి ఉన్న ముప్పులేమిటీ, దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలీ తదితర విషయాల గురించి నిపుణులు చెప్పిన విషయాలను ఒకసారి చూద్దాం.

శరీరంలో ఏ మూల చిన్న గాయమైనా జివ్వున పొంగే రక్తం ఆయా ప్రాంతాలన్నిటికీ చేరుకుని కణాలకు ప్రాణవాయువునీ పోషకాలనీ అందించగలుగుతోందంటే దానికి కారణం గుండె. అవయవాల నుంచి వచ్చే చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తూ, అక్కడ ఆక్సిజన్‌ని నింపుకుని వచ్చిన మంచి రక్తాన్ని మళ్లీ అవయవాలన్నిటికీ పంపిస్తూ... ఇలా నిరంతరం శ్రమిస్తూ ప్రాణాలను నిలబెడుతుంది గుండె. అది క్రమబద్ధంగా సంకోచవ్యాకోచాలు జరుపుతూ రక్తాన్ని పంప్‌ చేయడం ఎంత ముఖ్యమో దానికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు ఎలాంటి పూడికలూ లేకుండా ఆరోగ్యంగా ఉండడమూ అంతే ముఖ్యం. అందుకే గుండె, రక్తనాళాలూ అన్నిటినీ కలిపి ‘కార్డియో వాస్క్యులర్‌’ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ ఆరోగ్యమే మన ప్రాణాల్ని నిలబెడుతుంది. అలాంటి కీలకమైన వ్యవస్థ మీద ప్రభావం చూపుతున్న అంశాలు చాలావరకూ మనం చేజేతులా తెచ్చిపెట్టుకుంటున్నవి కావడమే ఆలోచించాల్సిన విషయం.

మన చేత్తోనే...

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గుండెజబ్బులకు జీవనశైలిలో వచ్చిన మార్పులే ప్రధాన శత్రువులని పరిశోధనలన్నీ తేల్చిచెబుతున్నాయి. మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్లు చేజేతులా గుండెకు కష్టం తెచ్చిపెట్టుకుంటున్నామంటున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడీ, వేళ తప్పి తినడమూ, అధిక కొవ్వు ఉండే బయటి ఆహారం మీద ఆధారపడడమూ, రోజంతా కదలకుండా కూర్చోవడమూ, ఆలస్యంగా పడుకుని తక్కువ గంటల నిద్రతో సరిపెట్టుకోవడమూ... ఇవన్నీ ఈ తరం జీవనవిధానంలో తప్పదని మనం అలవాటు చేసుకుంటున్నాం కానీ అవి పరోక్షంగా గుండెకు హాని చేస్తున్నాయని తెలుసుకోలేకపోతున్నాం. ఆకర్షణీయ ప్యాకేజీల్లో వచ్చే మిఠాయిలూ శీతలపానీయాలూ చక్కెరతో కూడిన పండ్లరసాలూ లాంటివి శరీరంలో ఫ్రీ షుగర్‌ పరిమాణాన్ని పెంచుతున్నాయి. అది ఐదుశాతం దాటితే చాలు, గుండెజబ్బులూ పక్షవాతం ముప్పు ఎన్నో రెట్లు పెరుగుతుందట. నిద్రలేమి ఒత్తిడినీ బీపీనీ పెంచుతుంది. అన్నీ కలిసి గుండె జబ్బులకు దారితీస్తాయి. చదువులూ ఉద్యోగాల ఒత్తిడి ఈ మధ్య కుంగుబాటుకు కారణమవుతోంది. కుంగుబాటుకు గురైనప్పుడు గుండె కొట్టుకునే రేటూ, రక్తపోటూ పెరుగుతాయి. అలాంటి పరిస్థితిలో మద్యపానం లాంటి అలవాట్లకు మొగ్గడం, నిద్రలేమికి గురికావడం సహజం. అన్నీ కలిసి మళ్లీ గుండెకే ఎసరుపెడుతున్నాయి. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలూ అతి తక్కువ ఉష్ణోగ్రతలూ వాయు కాలుష్యమూ గుండె పనితీరును దెబ్బతీస్తున్నాయని అధ్యయనాలు చెబుతుంటే వేడుకల్లో భాగంగా డీజేల పేరుతో మనమే సృష్టించుకుంటున్న ధ్వని కాలుష్యమూ ప్రాణాంతకమవుతుందని ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటనలు రుజువు చేశాయి. మనం సాధారణంగా వినే శబ్దాలు 65 డెసిబుల్స్‌కి మించవు. అలాంటిది 100-120 డెసిబుల్స్‌ ఉండే డీజే శబ్దాలను చెవి మూడు నిమిషాలకు మించి భరించలేదట. అధిక రక్తపోటూ, గుండె జబ్బులూ ఉన్నవాళ్లకు ఆ శబ్దం ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్త్రీలలో మెనోపాజ్‌ తర్వాత ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ విడుదల తగ్గిపోతుంది కాబట్టి గుండెకు సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఇప్పటివరకూ భావించారు. అయితే జీవనశైలి సమస్యల వల్ల మెనోపాజ్‌ కన్నా ముందే హార్ట్‌ ఎటాక్‌లు వస్తున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పెద్దలే కాదు, పిల్లలు కూడా అదే పనిగా వీడియో గేమ్స్‌ ఆడడం వల్ల హృదయస్పందనల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయనీ అది గుండె సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందనీ హెచ్చరిస్తున్నారు నిపుణులు.

వేర్వేరు...

హార్ట్‌ ఎటాక్‌ సడెన్‌గా వస్తుందనీ అందుకే ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నామనీ అనుకుంటారు. అవి అంత సడెన్‌గా ఏమీ రావనీ, వాటికి పునాది ఎప్పుడో పడి వుంటుందనీ, నిర్లక్ష్యమే ప్రాణం మీదికి తెస్తోందనీ చెప్పడానికి పైన చెప్పిన కారణాలు చాలు. ముప్పు కారకాలపై అవగాహన ఏర్పరుచుకుని వాటిని మార్చుకుంటే 80 శాతం గుండెజబ్బులను నివారించవచ్చట. గుండె సమస్యల్లో తేడాల్నీ, హెచ్చరికల్నీ గుర్తించగలిగితే ఇంకాస్త సమర్థంగా ఎదుర్కోవచ్చు.

గుండెపోటు: గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే తగినంత రక్తం అందక గుండె కండరం దెబ్బతింటుంది. అది ఎంత దెబ్బతిందీ అన్నదానిపై గుండెపోటు తీవ్రత ఆధారపడి ఉంటుంది. కండరం బాగా దెబ్బతింటే అప్పటికప్పుడే ప్రాణాల మీదికి వస్తుంది. స్వల్పంగా దెబ్బతింటే పెరగకముందే చికిత్స పొందవచ్చు.

గుండె ఆగిపోవడం(కార్డియాక్‌ అరెస్ట్‌): ఆడుతూనో, వ్యాయామం చేస్తూనో ఉన్నట్లుండి కుప్పకూలడం, నిద్రలోనే ప్రాణాలు వదలడం... దీని కిందికి వస్తాయి. ఇందులో గుండె రక్తాన్ని పంప్‌ చేయడం హఠాత్తుగా ఆగిపోతుంది. గుండె కొట్టుకునేలా చేసే విద్యుత్‌ వ్యవస్థ స్తంభించడం, పంపింగ్‌ యంత్రాంగం దెబ్బతినడం దీనికి కారణం. గుండెపోటు ఆరంభంలోనూ విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. దీన్నే చాలామంది తీవ్రమైన గుండెపోటుగా భావిస్తారు. స్వల్ప గుండెపోటులోనూ- దెబ్బతిన్న కండరానికీ మిగతా కండరాలకీ విద్యుత్‌ వ్యవస్థ పనితీరులో తేడా వచ్చేసరికి అక్కడ షాక్‌ కొట్టినట్లయి గుండె లయ మారిపోతుంది. పంపింగ్‌ వ్యవస్థ దెబ్బతిని చివరికి పనిచేయడం మానేస్తుంది. మూడుసెకన్ల కన్నా ఎక్కువసేపు గుండె కొట్టుకోకుండా ఉంటే కుప్పకూలిపోతారు. పుట్టుకతో తలెత్తే గుండె లయ సమస్యలు, గుండె కండరం మందం కావటం వంటివి కూడా హఠాత్తుగా గుండె ఆగిపోయే సమస్యకు దారితీయొచ్చు.

గుండె వైఫల్యం: గుండె కణజాలం దెబ్బతినడంతో అవసరమైనంత రక్తాన్ని పంప్‌ చేయలేక గుండె చేతులెత్తేస్తుంది. బలంగా పనిచేయాల్సి రావడం వల్ల క్రమంగా గుండె పెద్దగా అవుతుంది. కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లు, ఆటో ఇమ్యూన్‌ జబ్బులు, గర్భధారణ సమయంలో గుండె కండరం మందం కావడం, పుట్టుకతో వచ్చే లోపాలవంటివి కూడా దీనికి తోడై గుండెపోటుకు దారితీయవచ్చు. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడం, దీర్ఘకాలం మధుమేహంతో బాధపడుతుండడం వంటివి ప్రమాదాన్ని పెంచుతాయి. గుండె వైఫల్యానికి నాలుగు దశలుంటాయి. తొలిదశలో గుండె పనితీరు తగ్గినప్పటికీ లక్షణాలేమీ పైకి కన్పించవు. రెండోదశలో స్వల్పంగా కన్పిస్తాయి. మూడోదశలో లక్షణాల తీవ్రత పెరిగి రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. చివరి దశలో అర్జెంటుగా ఆస్పత్రిలో చేరాల్సివస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే- ఈ సమస్యని త్వరగా గుర్తిస్తే మందులతో నియంత్రించవచ్చు.

హెచ్చరికలు గుర్తించాలి

గుండెపోటుకి ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఎలాంటి లక్షణాలూ కన్పించకుండా గుండెపోటు రావడం అరుదు. గుండెనొప్పి ఛాతీ మధ్యలో వస్తుంది. 10-15 నిమిషాల సేపు ఛాతీభాగం పట్టేసినట్లు, గుండెమీద ఎవరో కూర్చున్నట్లు, బలంగా నొక్కుతున్నట్లు బరువుగా అన్పిస్తుంది. నడుస్తున్నప్పుడూ, పనిచేస్తున్నప్పుడూ నొప్పి పెరుగుతూ, విశ్రాంతి తీసుకునేటప్పుడు తగ్గుతుంది. ఈ నొప్పి మెడ, వీపు భాగాలకు పాకవచ్చు. ఎడమ భుజం, చేయిలోకీ విస్తరించవచ్చు. సార్బిట్రేట్‌ మాత్ర వేసుకుంటే నొప్పి తగ్గినట్లయితే అది గుండెనొప్పిగానే అనుమానించాలి. చెమటలు పడుతూ శ్వాస తీసుకోవడం కష్టమవుతున్నా, నీరసమూ నిస్సత్తువా  వేధిస్తున్నా, శరీరంలో ఎన్నడూ లేనివిధంగా అసాధారణమైన నొప్పులు కనిపిస్తున్నా, కాళ్లవాపులు వచ్చినా పరీక్ష చేయించుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం, పొగతాగడం లాంటి ముప్పు కారకాల్లో ఏ రెండు ఉన్నవారికైనా పై లక్షణాలు కన్పిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు.

ఇక, గుండె వైఫల్యం కేసుల్లో కన్పించే ప్రధాన లక్షణం ఆయాసం. గుండె పనితీరు మందగించడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. ఇది ఆయాసానికి దారితీస్తుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు ఊపిరాడక దగ్గుతో లేచి కూర్చుంటారు. గుండె కుడిభాగం బలహీనపడితే ఊపిరితిత్తుల వెలుపల భాగాల్లో నీరు చేరుతుంది. దీంతో కాళ్లూ మడమలూ ముఖమూ కడుపూ ఉబ్బరిస్తాయి. గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గటం వల్ల శరీరంలోని కణజాలాలకు తగినంత రక్తం అందకపోవడంతో త్వరగా అలసిపోవడం, కండరాలు పట్టేయడం లాంటి లక్షణాలు కనపడతాయి. మూత్రం తగ్గుతుంది. చర్మం పాలిపోతుంది. అదే మెదడుకి రక్తసరఫరా తగ్గితే మనిషి గందరగోళానికి గురవుతాడు. మగత కమ్ముతుంది. ఇక, గుండెకే రక్తసరఫరా తగ్గితే అది పనిచేయడం మానేస్తుంది.

లయ తప్పినా...

గుండెలోని పైన, కింద గదులు క్రమ పద్ధతిలో కొట్టుకోవడానికి తోడ్పడుతుంది దానిలోని ప్రత్యేకమైన విద్యుత్‌ ప్రసరణ వ్యవస్థ. పైన ఉన్న కుడి గదిలో సైనోఏట్రియల్‌ నోడ్‌ అనే ప్రత్యేక కణ సముదాయం ఉంటుంది. దీనినుంచి పుట్టే విద్యుత్‌ ప్రచోదనం గోడల గుండా ప్రసరిస్తూ గదుల్ని సంకోచించేలా చేస్తుంది. లయబద్ధంగా సాగే ఈ గదుల సంకోచ వ్యాకోచాలకు కీలకమైన విద్యుత్‌ ప్రసరణ వ్యవస్థ కనుక అస్తవ్యస్తమైతే గుండె హఠాత్తుగా ఆగిపోతుంది. శారీరకంగా ఫిట్‌గా ఉండి, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ముప్పు కారకాలేవీ లేకపోయినా చిన్నవయసులోనే గుండె ఆగిపోయి చనిపోవడానికి ఇలాంటి లయ తప్పే పరిస్థితి కారణం కావచ్చు. ఛాతీనొప్పి, స్పృహతప్పుతున్న పరిస్థితీ కన్పించిన వెంటనే చికిత్స అందిస్తే ఫలితం ఉంటుంది.

నిర్లక్ష్యం కూడదు

స్థూలకాయం, మధుమేహం, గుండెజబ్బులు లాంటి జీవనశైలి వ్యాధులన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. అందుకని తీసుకునే జాగ్రత్తలన్నీ కూడా దానికి తగినట్లే ఉండాలి. ప్రకృతిసిద్ధంగా లభించే ఆహార పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలి. రోజూ కనీసం అరగంటన్నా చెమట పట్టేంత వ్యాయామం చేయాలి. చురుకైన జీవనవిధానాన్ని అనుసరించాలి. కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉంటే ముప్పైఏళ్లు దాటినప్పటినుంచి రెండేళ్లకోసారి కొలెస్ట్రాల్‌, బీపీ, షుగర్‌ పరీక్షలు చేయించుకోవాలి. రక్తంలో కొవ్వు శాతం తెలుసుకుంటూ ఉండాలి. నేటి జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని మూడు పదుల వయసు నుంచే పరీక్షలు చేయించుకోవడం మంచిది. దాంతోపాటు ప్రతి కుటుంబంలోనూ ఒక్కరైనా ‘సీపీఆర్‌’ శిక్షణ పొందివుండాలి. చేతులతో బాధితుల ఛాతీ మీద ఒక పద్ధతి ప్రకారం నొక్కే ఈ ప్రక్రియ గుండెపోటు బాధితులను కీలకమైన సమయంలో ప్రాణాపాయం నుంచి గట్టెక్కిస్తుంది.

తెల్లారి లేచినప్పటినుంచీ లెక్కలేనన్ని పనులతో ఉరుకులు పరుగులు తప్పని జీవన విధానం మనది. అందుకని ‘సమస్యల సుడిగుండం’ అనుకుంటూ ఉంటాం కదా... నిజానికి ఈ జీవనశైలే మన గుండెనూ అలా సమస్యల సుడిగుండంలోకి నెడుతోంది. దాన్ని కాచుకోవాలంటే... జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవాల్సిందే!


ఇవి ముఖ్యం!

నిత్యజీవితంలో కొన్ని అలవాట్లను మార్చుకోగలిగితే గుండె పదిలంగా ఉంటుంది. పరిపూర్ణ జీవితాన్ని అందిస్తుంది.


ఒత్తిడి: ఇవాళా రేపూ ప్రతి వారి జీవితంలోనూ ఇది విడదీయరాని భాగమైంది. ఒత్తిడి హార్మోన్‌ కార్టిసోల్‌ రక్తపోటును పెంచుతుంది. దీనివల్ల జీవనశైలిలోనూ మార్పులొస్తాయి. ఒత్తిడికి లోనయ్యేవారు జంక్‌ ఫుడ్‌, కెఫీన్‌ పానీయాలవైపు మొగ్గుతారు. అందుకని ఒత్తిడిని తగ్గించుకోవడానికి శ్వాస వ్యాయామాలూ యోగా ధ్యానం లాంటివి అలవాటుచేసుకోవాలి. అనవసర ఆందోళనలను తగ్గించుకుని మానసిక ప్రశాంతత ఉండేలా చూసుకోవాలి.


మద్యపానం, ధూమపానం: ఇవి రెండూ సరదాగా అలవాటై వ్యసనాలుగా మారతాయి. గుండెకి ముప్పు తెస్తాయి. వాటిని మానేయాలి.


నిద్ర: ఏ సినిమాలో చూస్తూ ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా నిద్రలేవడంలో తాత్కాలిక ఆనందం ఉందేమో కానీ అది దీర్ఘకాలంలో గుండెని బలహీనం చేస్తుంది. నిద్రలో లోపలి అవయవాలు మరమ్మతులు చేసుకుంటాయి. దాంతో తెల్లారేసరికి శరీరం ఉత్తేజితం అవుతుంది. ఆ అవకాశాన్ని ఇవ్వకపోవడం గుండె భారాన్ని పెంచడమే. అలాగే నిద్రలో గురకని చాలామంది సాధారణ విషయంగా పరిగణిస్తారు. అది గుండెవైఫల్యం లాంటి పెద్ద సమస్యకి సూచన కావచ్చు. నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోవాలి.


ఆహారం: ఉప్పూ చక్కెరా వేపుళ్లూ మాంసాహారమూ బాగా తగ్గించుకోవాలి. పండ్లూ కూరగాయల్లో లభించే సహజ చక్కెర వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు, అందుకని వాటినీ పీచుపదార్థాల్నీ ఎక్కువగా తీసుకోవాలి. మిథియోనైన్‌, క్రిస్టీన్‌ వంటి సల్ఫర్‌ అమైనో ఆమ్లాలతో తయారైన ప్రొటీన్లు మాంసం, పాల ఉత్పత్తులతో పోలిస్తే కూరగాయల్లో తక్కువ. ఈ ఆమ్లాలను ఆహారంలో తక్కువగా తీసుకునేవారిలో గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పు తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.


వ్యాయామం: అసలు చేయకపోవడమూ, అతిగా చేయడమూ రెండూ తప్పే. తగినంత వ్యాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరం చురుగ్గా ఉంటుంది. స్థూలకాయం రాదు. బీపీ, మధుమేహం అదుపులో ఉంటాయి.


ఇన్‌ఫెక్షన్లు: న్యూమోనియా, మూత్రకోశ ఇన్‌ఫెక్షన్ల వంటి సమస్యల బారినపడిన మూడునెలల తర్వాత గుండెపోటు ముప్పు 37శాతం, పక్షవాతం ముప్పు 30శాతం పెరుగుతాయట. ఇన్‌ఫెక్షన్లు రాకుండానే చూసుకోవాలి. వచ్చినా అప్రమత్తంగా ఉండాలి.


మందులూ పరీక్షలూ: జీవనశైలి వ్యాధులకు సంబంధించి మందులు వాడేవారు వైద్యుల సూచనలను తు.చ.తప్పక పాటించాలి. రోజూ వేసుకుంటున్నాం కదా, ఒక్కరోజు వేసుకోకపోతే ఏమవుతుందిలే అనుకోవడం-ప్రమాదాన్ని చేతులారా ఆహ్వానించడమే. అలాగే పరీక్షలు కూడా క్రమం తప్పకుండా చేయించుకోవాలి.


గుండె ఊసులు!

ఛాతీ భాగంలో సరిగ్గా పక్కటెముకల మధ్యలో కొంచెంగా ఎడమపక్కకువాలి ఉండే గుండె పావుకిలోకి కాస్త ఎక్కువ బరువుంటుంది.

* వయోజనుల గుండె నిమిషానికి 60 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. అంటే రోజుకు లక్షసార్లు. పురుషులకన్నా స్త్రీల గుండె కాస్త వేగంగా కొట్టుకుంటే, పసిపిల్లల హృదయ స్పందనలు అంతకన్నా వేగంగా (70 నుంచి 190సార్ల వరకూ) ఉంటాయట.

* గుండె ఒక్కసారి కొట్టుకున్నప్పుడు 70మి.లీ. రక్తం బయటకు వస్తుంది. అలా నిమిషానికి దాదాపు ఐదారు లీటర్ల రక్తాన్ని, రోజుకి 7600 లీటర్ల రక్తాన్ని శరీరావయవాలకు పంప్‌ చేస్తోందీ గుండె.

* గుండె నిర్మాణంలోనే ఉన్న ప్రత్యేకత వల్ల దాన్ని శరీరం నుంచి వేరుచేసినా 4-6 గంటల పాటు కొట్టుకుంటూనే ఉంటుంది. తగిన ఉష్ణోగ్రతలో ఆక్సిజన్‌ అందేలా ఉంచితే చాలు.


పూడిక ఒక్కటే కాదు..!

గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో వంద శాతం రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు వస్తుంది. మూడోవంతు మందిలో 80-90 శాతం పూడికలే ప్రమాదానికి దారితీయవచ్చు. 30-40 శాతం మాత్రమే పూడుకుపోయిన రక్తనాళాలు వ్యాయామం చేసేటప్పుడు పూర్తిగా మూసుకుపోయి సమస్యను తెస్తాయి. పొగతాగేవారిలో పూడిక చాలా తక్కువ శాతమే ఉన్నా శారీరకంగా కానీ మానసికంగాకానీ కష్టపడితే గుండెపోటు సంభవించే ప్రమాదం ఉంది. ఇవే కాకుండా... జన్యుపరమైన కారణాలూ, శారీరక దృఢత్వాన్ని పెంచుకునేందుకు మాదకద్రవ్యాలనూ మాంసకృత్తులనూ అధికంగా తీసుకోవడం లాంటివీ ప్రమాదానికి దారితీస్తాయి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు