Modi: మోదీ ప్రమాణస్వీకార మహోత్సవానికి విదేశీ నేతలు

నరేంద్రమోదీ(Narendra Modi).. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమైంది. దీనికి పొరుగు దేశాల అధినేతలు హాజరుకానున్నారు.  

Updated : 06 Jun 2024 13:34 IST

దిల్లీ: తమ కూటమికి నాయకుడిగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నరేంద్రమోదీ (Modi)ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో.. ఆయన మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. ఈ నెల జూన్‌ 9న ప్రధానిగా ఆయన ప్రమాణస్వీకార మహోత్సవం(swearing-in ceremony) ఉండనుంది. దీనికి విదేశీ నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.

పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్‌, నేపాల్, మారిషస్ అధినేతలకు మన ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత ప్రభుత్వం నుంచి రణిల్‌ విక్రమసింఘేకు ఇప్పటికే ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడి మీడియా కార్యాలయం వెల్లడించింది. దానిని తమ అధ్యక్షుడు అంగీకరించారని తెలిపింది. అలాగే బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్ హసీనాతో మోదీ ఫోన్లో మాట్లాడారని, ప్రమాణ స్వీకారకార్యాక్రమానికి  ఆహ్వానించారని దౌత్య వర్గాలు తెలిపాయి. మిగతా నేతలకు అధికారిక ఆహ్వానాలు వెళ్లనున్నాయని పేర్కొన్నాయి. 2014లో మోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సార్క్‌(SAARC) దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. 2019లో బిమ్స్‌టెక్‌ (BIMSTEC) దేశాల నాయకులు ప్రమాణస్వీకారానికి వచ్చారు.

ఇదిలా ఉంటే.. ప్రధాని అధికారిక నివాసంలో బుధవారం కూటమి నేతలంతా సమావేశమైన సంగతి తెలిసిందే. మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కూటమిపరంగా లాంఛనాలన్నీ పూర్తికావడంతో.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతూ ఎన్డీయే నేతలంతా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే మెజార్టీ మార్కు దాటినప్పటికీ, భాజపాకు ఊహించిన ఫలితాలు మాత్రం దక్కలేదు. దాంతో 240 సీట్లు దక్కించుకున్న భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని