Mount Everest: మంచుకొండల్లో మృత్యు ఘంటికలు.. ఎవరెస్టులో 8కి చేరిన మరణాలు!

ఎవరెస్టు పర్వతారోహణ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

Published : 28 May 2024 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించేందుకు ఔత్సాహిక పర్యటకులు క్యూ కడుతున్నారు. ఈ సాహసయాత్ర చేసే క్రమంలో అక్కడి ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యం కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది. పర్వతారోహణ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు నేపాల్‌ అధికారులు వెల్లడించారు.

బాన్షీలాల్‌ (46) అనే భారతీయ పర్వతారోహకుడు గతవారం ఎవరెస్టు మార్గంలో చిక్కుకుపోయాడు. అతన్ని రక్షించిన రెస్క్యూ సిబ్బంది.. కాఠ్‌మాండూలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న ఆయన మరణించినట్లు నేపాల్‌ పర్యటక శాఖ పేర్కొంది. ఇలా ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది చనిపోయారని తెలిపింది. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తితో పాటు ఇద్దరు నేపాలీ షెర్పాల(గైడ్లు) ఆచూకీ లభించకపోవడంతో వారూ మరణించినట్లుగానే భావిస్తున్నారు. అయితే, మునుపటితో పోలిస్తే ఈసారి ఎవరెస్టులో మరణాల సంఖ్య తక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. గతేడాది మృతుల సంఖ్య 18గా నమోదైంది.

డెత్‌ జోన్‌లోనే..

ఎవరెస్టు పర్వతారోహణ క్రమంలో సంభవించే మరణాలన్నీ 8వేల మీటర్ల ఎత్తు పరిధిలోనే నమోదవుతున్నాయి. దీన్నే ‘డెత్‌ జోన్‌’గా పరిగణిస్తారు. ఇక్కడ ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండటం, ప్రతికూల వాతావరణం వంటివి అనారోగ్యం ముప్పును పెంచుతాయి. దీంతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతోపాటు పర్వతాల్లో జారిపడటం వంటివీ చోటుచేసుకుంటాయి.

ప్రపంచంలో ఎత్తైన తొలి పది పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి. ఈ ఏడాది దాదాపు 900 మంది ఔత్సాహిక పర్వతారోహకులకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీరిలో 419 మంది ఎవరెస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అనేకమంది పర్వతారోహకులు, షెర్పాలు ఇప్పటికే శిఖరాన్ని అధిరోహించినట్లు సమాచారం. మరోవైపు అటు చైనా కూడా టిబెట్‌ మార్గం నుంచి ఈ ఏడాది అనుమతులు ఇస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని