India-Canada: కెనడాలో భారత అధికారులకు బెదిరింపులొచ్చాయ్‌: జైశంకర్‌

India-Canada: గత ఏడాది కెనడాతో దౌత్యపరమైన విభేదాలు తలెత్తిన సమయంలో అక్కడ ఉన్న భారత దౌత్యాధికారులకు బెదిరింపులొచ్చాయని విదేశాంగమంత్రి జైశంకర్‌ సోమవారం వెల్లడించారు.

Published : 27 Feb 2024 10:14 IST

దిల్లీ: కెనడాలో గత ఏడాది భారత దౌత్యాధికారులకు వరుస బెదిరింపులు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) తెలిపారు. అదే సమయంలో ఆ దేశ వ్యవస్థల నుంచి ఎలాంటి సహకారం లభించలేదన్నారు. అందువల్లే అక్కడ వీసా జారీ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు. ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు భారత ఏజెంట్లే కారణమని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) నిరాధార ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య అప్పట్లో దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. ఫలితంగా గత ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌ అక్కడ వీసా సేవలను నిలిపివేసింది. ఆ సమయంలో తలెత్తిన పరిస్థితులను వివరిస్తూ జైశంకర్‌ సోమవారం ఓ సమావేశంలో పై వ్యాఖ్యలు చేశారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌, లండన్‌లోని హైకమిషన్‌పై దాడులు చేసిన వారితో పాటు కెనడాలో భారత దౌత్యాధికారులను బెదిరించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని జైశంకర్‌ (S Jaishankar) డిమాండ్‌ చేశారు. కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు ఓ దశలో భారత దౌత్య కార్యాలయాలపై ‘స్మోక్‌ బాంబు’లు విసిరారని తెలిపారు. వారికి అక్కడ అంత స్వేచ్ఛ లభించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర దేశాల ప్రతినిధులను బెదిరించే స్థాయికి వాక్‌స్వేచ్ఛ విస్తరించడం మంచిది కాదని హితవు పలికారు.

యూకే, యూఎస్‌, ఆస్ట్రేలియాలోనూ ఈ తరహా దాడులు జరిగాయని జైశంకర్‌ (S Jaishankar) గుర్తుచేశారు. తగినంత భద్రత లభించలేదని తెలిపారు. కానీ, తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని పేర్కొన్నారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి దాడులు జరిగినా చాలా బలమైన ప్రతిస్పందన వస్తుందని వెల్లడించారు. ఒక దేశ రాయబార కార్యాలయాలపై దాడులు జరిగినప్పుడు స్థానిక ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం తప్పుడు సంకేతాలను పంపిస్తుందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని