Pakistan spy: మాస్కో భారత దౌత్య కార్యాలయంలో పాక్‌ గూఢచారి: మేరఠ్‌లో అరెస్ట్‌

మాస్కోలోని భారత దౌత్య కార్యాలయం పాక్‌ గూఢచర్యానికి లక్ష్యంగా మారింది. ఏకంగా అక్కడ తన వేగును నియమించుకుంది.

Updated : 04 Feb 2024 13:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌(India)-రష్యా (Russia) వ్యూహాత్మక సంబంధాలపై పాక్‌ నిఘా పెట్టింది. ఏకంగా మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్‌ఐ తన గూఢచారిని నియమించింది. తాజాగా అతడిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ మేరఠ్‌లో అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సతేందర్‌ సివాల్‌గా గుర్తించింది. అతడు విదేశాంగ శాఖలో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు.

భారత విదేశాంగ శాఖలో ఒక ఐఎస్‌ఐ ఏజెంట్‌ చొరబడ్డాడని రహస్య సమాచారం అందడంతో ఏటీఎస్‌ అప్రమత్తమైంది. అతడు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌ నిఘా సంస్థకు అందజేస్తున్నాడని.. ప్రతిగా డబ్బు తీసుకొంటున్నట్లు పసిగట్టింది. ఈ సమాచారం భారత్‌కు భారీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు.

సతేందర్‌ది హాపూర్‌ జిల్లా షమహిద్దుయూన్‌పుర్‌గా గుర్తించారు. అతడు మాస్కోలోని కార్యాలయంలో 2021 నుంచి ఇండియా బేస్డ్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌గా (ఐబీఎస్‌ఏ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌లో అతడు కీలక వ్యక్తని అధికారులు చెబుతున్నారు. తన హోదాను అడ్డం పెట్టుకుని అతడు ముఖ్య పత్రాలను సంపాదించాడు. వీటిల్లో రక్షణ, విదేశాంగ శాఖ నిర్ణయాలు, సైన్యం రోజువారీ కదలికలు వంటి వివరాలున్నాయి. ఈ క్రమంలో అతడు కొందరు భారత అధికారులకు లంచాలు కూడా ఆశ చూపాడు. ఈ సమాచారాన్ని పాక్‌లోని ఐఎస్‌ఐ ప్రతినిధులకు చేర్చాడు. అతడి కదలికలపై నిఘా పెట్టిన తర్వాతే ఏటీఎస్‌ అధికారులు మేరఠ్‌లో విచారణకు పిలిపించారు. అడిగిన ప్రశ్నలకు అతడు సరైన సమాధానాలు ఇవ్వలేదు. చివరికి తాను పాక్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు అంగీకరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని